దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. కొత్త ఏడాదిలో 8వ వేతన సంఘం సిఫార్సులు వచ్చేలోపు..
పెరగాల్సిన డీఏ, ఫిట్ మెంట్ లపై శుభవార్త చెప్పేందుకు సిద్దమవుతోంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై కీలక సూచనలు చేశాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే వీటిపై కేంద్రం తన నిర్ణయం ప్రకటించబోతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, భత్యాలు మరియు పెన్షన్లను సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా 7వ వేతన సంఘం గడువు 31 డిసెంబర్ 2025న ముగిసింది. దీంతో 8వ వేతన సంఘం 1 జనవరి 2026 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం 8వ వేతన సంఘం కోసం నిబంధనలను (ToR) నవంబర్ 2025లో ఆమోదించినప్పటికీ, కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి దాదాపు 18 నెలలు పట్టవచ్చు. కేబినెట్ కొత్త సిఫార్సులను ఆమోదించే వరకు, ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారం జీతాలను అందుకుంటూనే ఉంటారు.
అయితే 8వ వేతన సంఘం సిఫార్సులు అమలయ్యే వరకూ 7వ వేతన సంఘం సిఫార్సుల ఆమోదం ప్రకారమే ఉద్యోగులకు జీతభత్యాలు అందుతాయి. 8వ వేతన సంఘం అమలు తర్వాత పెరిగిన జీతభత్యాల బకాయిల్ని జనవరి 1 నుంచి లెక్కించి ఇస్తారు. అయితే కొత్త వేతన సంఘం రాక తర్వాత ఇప్పటికే ఉన్నడీఏ కొత్త బేసిక్ పేలో విలీనం చేయబోతున్నారు. దీంతో డీఏ చెల్లింపులు సున్నా నుంచి లెక్కిస్తారు. ఈ పెరిగే డీఏ 74 శాతానికి చేరుతుంది. ఇందులో ఉద్యోగ సంఘాలు కీలక సూచన చేస్తున్నాయి.
ప్రస్తుతం అమలవుతున్న డీఏను గతేడాది జూలై1న 58 శాతానికి పెంచారు. ఇప్పుడు మరోసారి జనవరి1న పెంచాల్సి ఉంది. కానీ ఇంకా పెంచలేదు. ఈ నేపథ్యంలో జిత్ సింగ్ పటేల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్.. జనవరి 2028 నాటికి డీఏ దాదాపు 74%కి చేరుకుంటే, డీఏలో 50 శాతాన్ని మూలవేతనంలో విలీనం చేయాలని కోరింది. మిగిలిన డీఏ 24 శాతం కొనసాగుతుందని వెల్లడించింది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్ధితుల్లో ఇది ఉద్యోగులపై ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని చెబుతోంది. అలాగే ఫిట్ మెంట్ లెక్కింపులో కనీస వేతన గణన కోసం కుటుంబ యూనిట్‌ను 3 నుండి 5 మంది సభ్యులకు పెంచాలని కోరుతోంది. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


































