చాలా మందికి మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోవడం అలా కాసేపు కునుకు తీయడం అలవాటు. మధ్యాహ్న భోజనం తర్వాత జీర్ణవ్యవస్థలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది.
దీని కారణంగా ఒక్కసారిగా నిద్రమత్తు, అలసట వంటి అనుభూతి కలుగుతుంది. అయితే ఇలా పగటి పూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..
మధ్యాహ్నం నిద్ర శరీరానికి మంచిదా? చెడ్డదా..? మీ ఆరోగ్యంపై మధ్యాహ్నం నిద్ర ప్రభావం ఎలా ఉంటుందో వంటి వివరాలు నిపుణుల మాటల్లో.. సాధారణంగా 7 నుంచి 8 గంటల నిద్ర మంచిదని వైద్యులు చెబుతుంటారు. చాలా సార్లు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. అటువంటి వారికి మధ్యాహ్నం నిద్ర అవసరం. పెరుగుతున్న పనిభారం, బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడితో కూడిన పరిస్థితులతో ఉన్న వ్యక్తులకు, మధ్యాహ్నం నిద్ర రిఫ్రెష్‌గా అనిపిస్తుంది.
మధ్యాహ్న నిద్ర శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును కూడా రిలాక్స్ చేస్తుంది. రోజులో దాదాపు 1 గంట నిద్రపోవడం వల్ల శరీరం కండరాలు మొత్తం విశ్రాంతి పొందుతాయి. అలాగే ఈ నిద్ర మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత, రిఫ్రెష్‌గా కనిపిస్తారు.
అయితే మధ్యాహ్నం అరగంటకు మించి నిద్రపోకూడదు. దీని కంటే ఎక్కువసేపు నిద్రపోవడం మీ శరీర జీవ గడియారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రాత్రి సహజంగా వచ్చే నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల రాత్రిపూట తగినంత నిద్ర పొందడానికి పగటి పూట అరగంటకు మించి నిద్రపోకూడదు.
స్కూల్ విద్యార్ధులు 3 గంటల తర్వాత పాఠశాల నుండి ఇంటికి వస్తే, పడుకునే బదులు.. వారిని ఆడుకోనివ్వాలి. ఇలా చేస్తే రాత్రి త్వరగా నిద్రపోవడం అలవాటు అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పడుకోవడం వల్ల రాత్రి పిల్లల నిద్రకు భంగం కలుగుతుంది.