ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయనకు గుండెలో కవాటాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు నేతలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి పరిస్ధితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కొడాలి నాని గుండె సమస్యలతో బాధపడుతూ తొలుత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరగా.. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయన్ను స్టార్ ఆస్పత్రికి మార్చినట్లు తెలుస్తోంది. అక్కడికి గుడివాడ వైసీపీ నేతలతో పాటు నాని కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. నానికి అక్కడ మరోమారు పరీక్షలు నిర్వహించాక బైపాస్ సర్జరీ చేసే అవకాశాలున్నాయి. రెండు, మూడు రోజుల్లో నానికి బైపాస్ సర్జరీ చేస్తారని తెలుస్తోంది.
కొడాని నానికి గుండె పోటు వచ్చిందని తొలుత వార్తలు రాగా ఆయన అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్ మాత్రం జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ మీడియాకు వెల్లడించారు. గుండెపోటు అంటూ వచ్చిన వార్తలు తప్పన్నారు. కానీ ఒక రోజు తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా డాక్టర్లతో మాట్లాడి ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో వైసీపీ అధికారికంగానే ఓ ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచీ కొడాలి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.
వైసీపీ ఈ ప్రకటనలోనే కొడాలి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది. త్వరలో బైపాస్ సర్జరీ నిర్వహించాలా లేక స్టంట్ వేయాలా అన్న దానిపై డాక్టర్లు చర్చిస్తునట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఆయన్ను స్టార్ అస్పత్రికి తరలించి సర్జరీ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కొడాలి నాని సర్జరీ సక్సెస్ కావాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.