త్వరలో కేంద్రం మరో శుభవార్త..? వారికి కూడా పీఎఫ్ అకౌంట్

పీఎఫ్‌వోకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ఆదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం పీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది.


ఎన్నో ఏళ్లుగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. బేసిక్ పే రూ.15 వేలలోపు ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్‌కు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ బేసిస్ పే కలిగి ఉన్నవారు అవసరమైతే ఈపీఎఫ్‌కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. వద్దనుకుంటే కాంట్రిబ్యూట్ చేయకుండా వదులుకోవచ్చు. ఇప్పటివరకు వీరికి కేవలం ఆప్షనల్‌గా ఉంది. దీని వల్ల రూ.15 వేలకు మించి బేసిక్ శాలరీ ఉన్నవారు ఈపీఎఫ్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో గరిష్ట వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటంటే..?

పీఎఫ్ గరిష్ట వేతన పరిమితి పెంచడంపై కేంద్రం నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. బేసిక్ పే రూ.15 వేలు కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు దక్కకపోవడం దారుణమని, దీని వల్ల చాలామంది చిరుద్యోగులు నష్టపోతున్నారని తెలిపింది. 11 ఏళ్లుగా దీనిని సవరించకపోవడం ఏంటని ప్రశ్నించింది. పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిపై ఎన్నో ఏళ్లుగా ఎలాంటి సవరణలు చేయకపోవడంపై సామాజిక కార్యకర్త నవీన్ ప్రకాశ్ నౌటియాల్ సుప్రీంకోర్టుల్ పిటిషన్ వేశారు. గరిష్ట పరిమితి రూ.15 వేలు నిబంధన పెట్టడం వల్ల చిరుద్యోగులు పీఎఫ్ పథకానికి దూరమవుతున్నారని, వారికి ఆర్ధిక భద్రత ఉండటం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. గరిష్ట వేతన పరిమితిని పెంచేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.30 వేలకు పెంచే ఆలోచన?

అయితే ఎక్కువమంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో కేంద్రం బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.30 వేలకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో గరిష్ట వేతన పరిమితి రూ.6 వేలుగా మాత్రమే ఉండేది. కానీ 2014లో దానిని రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత కాలానుగుణంగా ఇప్పటివరకు ఆ లిమిట్‌ను ఈపీఎఫ్‌వో పెంచలేదు. ద్రవ్యోల్బణం, ఆదాయం, ఆర్ధిక స్థితిగతులను బట్టి గరిష్ట పరిమితి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం ఉద్యోగులకు లాభం జరిగేలా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఖచ్చితంగా పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని పెంచాలనే నిబంధన ఇప్పటివరకు లేవు. అందుకే కేంద్రం చాలా ఏళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో కదలిక వస్తుందేమోనని ఉద్యోగులు ఆశ పడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.