చార్లెస్ డార్విన్ వివరించిన సహజ పరిణామ ఎంపిక (Natural Selection) థియరీ ఇప్పటి మన ఆధునిక జీవితాలకూ వర్తిస్తుంది. ఆ థియరీ ప్రకారం- భూమిపై బలం కలిగిన లేదా అత్యంత తెలివైన జీవజాతులే శాశ్వతంగా కొనసాగుతాయని చెప్పలేం.
మార్పులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారిన జీవజాతులే మనుగడను కొనసాగిస్తాయి. దీన్నే అడాప్టేషన్ అంటారు. ఇది జీవజాతులకే గాక, మనుషులు సృష్టించిన టెక్నాలజీలకు కూడా వర్తిస్తుంది. టెక్నాలజీలో ఊహించనంత వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా స్మార్ట్ ఫోన్ శకం కూడా త్వరలో ముగుస్తుంది అంటున్నారు నిపుణులు. అంటే ఇప్పటికిప్పుడు స్మార్ట్ ఫోన్లు మాయమైపోతాయని కాదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సమాచార వినిమయంతో పాటు చెల్లింపులు, ఉద్యోగం, వినోదాల కోసం స్మార్ట్ ఫోన్ల పైనే ఆధారపడుతున్నారు. కానీ కొంతమంది ఫ్యూచరిస్టుల అంచనాల ప్రకారం డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ల్యాప్‌టాప్‌లు ఆక్రమించినట్టే స్మార్ట్ ఫోన్లను ఇంకో అత్యాధునిక టెక్నాలజీ మింగేస్తుందని అంటున్నారు. ఈ టెక్నాలజీ ఏదైనా కావచ్చు. చేతులకు, తలకు అమర్చుకునే పరికరాలు (వేరబుల్స్) కావచ్చు. యాపిల్, మెటా వంటి కంపెనీలు ఇప్పటికే కొన్ని స్మార్ట్ కళ్లజోళ్లు తయారు చేస్తూండగా, ఇంకొన్ని కంపెనీలు కాంటాక్ట్ లెన్సుల్లోనే కంప్యూటర్ స్క్రీన్లను చేరుస్తున్నాయి. కాలక్రమంలో మొబైల్స్‌పై ఆధారపడటాన్ని కృత్రిమ మేధతో పనిచేసే ఇయర్ ఫోన్స్ తగ్గించవచ్చునని అంచనా. ఇలాంటివి కాకపోతే, గొంతు విని పనిచేసే కృత్రిమ మేధ సహాయకులు (ఏఐ అసిస్టెంట్లు) కూడా స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయాలు కావచ్చు.
చాట్ జీపీటీ వంటి వాటిని ఇప్పటికే వేరబుల్స్‌లో చేర్చారు. ఇది టచ్ స్క్రీన్ల స్థానంలో మాటలతో పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థకు దారి తీయవచ్చు. ఫోన్లు చేసే అనేకానేక పనులను ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) కళ్లజోళ్లు చక్కబెట్టేస్తాయి. అది నావిగేషన్ కావచ్చు, కాల్స్ కావచ్చు, బ్రౌజింగ్ కావచ్చు. ఇవేగాక, ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న న్యూరాలింక్ ప్రాజెక్టు వంటివి కంప్యూటర్లను నేరుగా మన మెదడుకు అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే మెదడుతో ఆలోచించగానే పనులైపోతాయన్నమాట! స్మార్ట్ ఫోన్లు పూర్తిగా కనుమరుగయ్యేందుకు ఎంత సమయం పడుతుందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఐదు నుంచి పదేళ్లని అంచనా వేస్తూంటే… ఇంకొంతమంది స్మార్ట్ ఫోన్ల వాడకం కొనసాగుతుందని, కాకపోతే ఏఆర్, ఏఐ పరికరాల కారణంగా వాటిపై నిత్యం ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని అంటున్నారు. పదీ ఇరవై ఏళ్ల కాలంలో స్మార్ట్ ఫోన్ల స్థానంలో ఏఐ ఆధారిత కళ్లజోళ్లు, ఇయర్‌బడ్స్, వాయిస్ అసిస్టెంట్లు చేరతాయని, ఐపాడ్‌లు, ల్యాండ్‌లైన్ ఫోన్ల మాదిరిగా అప్పటికి స్మార్ట్‌ఫోన్లు అవశేషాలుగా మిగిలిపోతాయని మరికొంతమంది అంచనా. స్మార్ట్ ఫోన్లు కనిపించకుండా పోయే ముందు ఏఆర్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వంటి టెక్నాలజీలు సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావాల్సిన అవసరముందని, క్వాంటమ్ ప్రాసెసింగ్, 5జీ/ 6జీ+, అతిసూక్ష్మమైన బ్యాటరీల వంటి టెక్నాలజీలు పరిపక్వమయ్యేందుకు రెండు మూడు దశాబ్దాలు పట్టవచ్చు అన్నది కూడా ఒక దీర్ఘకాలిక అంచనా. ప్రస్తుతం ఈ దిశగా కంపెనీలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయన్నది కూడా ఆసక్తికరమైన అంశం.
యాపిల్ స్పేషియల్ కంప్యూటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. దీని ద్వారా పది – పదిహేనేళ్ళల్లో ఐఫోన్ల నుంచి వినియోగదారులు దూరం జరిగేలా చేయవచ్చునంటోంది. మెటా, గూగుల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఏఆర్ వేరబుల్స్ సాయంతో స్మార్ట్ ఫోన్లు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి. హ్యూమేన్ కంపెనీ తయారు చేసిన ‘ఏఐ పిన్’, ‘రాబిట్ ఆర్ 1’లు స్మార్ట్ ఫోన్‌కు ప్రత్యామ్నాయాలుగా ఎలా ఉంటాయన్న విషయంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు టెలికామ్ సంస్థలు 2030 నాటికి ఏఆర్, వీఆర్, ఏఐ వ్యవస్థలకు అవసరమైన 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్ల ఆధిపత్యం 2030ల వరకూ కొనసాగే అవకాశం ఉంది. ఏఐ, ఏఆర్ టెక్నాలజీలు కలిసిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ అనేది బ్యాకప్ కోసం పనికొచ్చే ఒక పరికరంగా మిగిలిపోవచ్చు. 2040 నాటికి ప్రజలు దైనందిన జీవితాల్లోంచి స్మార్ట్ ఫోన్లు క్రమంగా తొలగిపోతాయని నిపుణుల అంచనా. స్మార్ట్ ఫోన్లు కనమరుగవటం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ముందు లాభాలేమిటో చూద్దాం. చిన్న చిన్న స్క్రీన్ల అవసరం లేకుండా పోతుంది. ఏఆర్ కళ్లజోళ్లు, ఏఐ వాయిస్, యాంబియంట్ కంప్యూటింగ్‌ల కారణంగా అంతా సహజంగా జరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్లతో ఇప్పుడున్న అనేక సమస్యలు లేకుండా పోతాయి. ఏఐ, ఏఆర్, వేరబుల్స్, బ్రెయిన్ కంప్యూటింగ్ టెక్నాలజీలు కేంద్రంగా కొత్త కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి. స్మార్ట్ ఫోన్ల స్థానంలో పునర్వినియోగం చేయగల ఏఆర్ కళ్లజోళ్ల వంటివి వస్తే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేకుండా పోతాయి. ఇక నష్టాలేమిటంటే- ఏఐ, ఏఆర్, వేరబుల్స్ వ్యక్తిగత వివరాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టే ప్రమాదం ఉంది. దైనందిన వ్యవహారాల రికార్డింగ్, ట్రాకింగ్‌లతోపాటు మన సంభాషణలను వినే అవకాశాలుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ కొత్త టెక్నాలజీలను అందుకోలేని పరిస్థితి ఏర్పడితే సామాజిక అంతరాలు మరింత పెరుగుతాయి.
మరి ఫోన్ తయారీ కంపెనీల పరిస్థితి? ఫాక్స్‌కాన్, పెగట్రాన్, శాంసంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు చైనా, వియత్నాం, భారత్‌లలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అన్నవే లేకపోతే ఈ ఫ్యాక్టరీలన్నీ ఏఆర్ కళ్లజోళ్లు, వేరబుల్స్, సూక్ష్మ లేదా ఇంటర్నెట్ ఆధారిత పరికరాల తయారీవైపు మళ్లాల్సి వస్తుంది. తొలినాళ్లలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయినా వారిని ఏఆర్, ఇతర పరికరాల తయారీలో భాగ స్వాములను చేయవచ్చు. ఫోన్లకు అవసరమైన బ్యాటరీలు, డిస్‌ప్లే యూనిట్లు, చిప్‌సెట్లు తయారు చేసే కంపెనీలు సూక్ష్మస్థాయి పరికరాల తయారీని అలవాటు చేసుకుంటాయి. స్మార్ట్ ఫోన్లు లేని ప్రపంచంలో అప్లికేషన్లు (యాప్స్) ఉంటాయి కానీ ఇప్పుడున్న రూపంలో కాదు. చాట్ ఆధారంగా, సంజ్ఞల ఆధారంగా, గొంతు ఆధారంగా పనిచేసే అప్లికేషన్లు అందు బాటులోకి వస్తాయి. నైపుణ్యాలను మరింత పెంచుకుంటేనే ఉద్యోగాలు ఉంటాయన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ఉద్యోగాలు లేకుండా పోవు కానీ, వాటి తీరుతెన్నులు మారతాయి. కొన్నేళ్ల క్రితం ఉన్న వెబ్ డిజైనర్లు ఇప్పుడు స్మార్ట్ అప్లికేషన్ల తయారీకి మళ్లినట్టు. 2007లో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు మన తరం ముగియక ముందు అంతరించిపోవడం విషాదమేమీ కాదు. మరో అత్యాధునిక సాంకేతికత వైపు ప్రపంచం దూసుకెళ్తున్నందుకు సంతోషించాలి. టెక్నాలజీలో కూడా పరిణామ క్రమాలు ఉంటాయి. అందిపుచ్చుకుంటే ముందుకెళ్తాం. లేకపోతే ఉన్న దగ్గరే నిలిచిపోతాం!
































