1997 నుంచి 2024 వరకు, సాఫ్ట్‌వేర్ రంగం ఒక అపూర్వమైన స్వర్ణయుగం. ఈ రెండు దశాబ్దాల్లో ఎన్నో కుటుంబాలు మధ్య తరగతి నుంచి పైకి వచ్చాయి. బాగా చదివిన వారు కాదు, చాలా మంది “సాదాసీదా” ఇంజినీర్లూ కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లో స్థిరపడిపోయారు.
అప్పట్లో ఏ బ్రాంచ్ అయినా సరే, కాస్త కోడింగ్ నేర్చుకుంటే చాలు, ఆన్ సైట్ ప్రయాణం ఖాయం. ఇంటర్వ్యూలు రాయించుకునే పద్ధతులూ, ఫేక్ ప్రాజెక్టులూ కూడా దాదాపుగా ఓ శాస్త్రమే అయిపోయాయి.
అప్పట్లో ఒకవైపు ఉద్యోగాల సునామీ, మరోవైపు మనం బట్టీ మోడ్‌లో చదువుకోవడం కలిసొచ్చాయి. ఫలితంగా లక్షల్లో జీతాలు, ప్లాట్లు, డాలర్లు ఇవన్నీ సాధ్యమయ్యాయి.. కానీ, ఇప్పడు ఈ టెక్ యుగంలో ఈ డ్రీమ్ రన్(మెషిన్) ఆగిపోయింది! ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ యుగంలోకి అడుగు పెట్టింది. ఎంట్రీ లెవెల్ కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ లాంటి పనులన్నీ మిషన్లే చేసేస్తున్నాయి. ఇప్పటి నుంచి గజి బిజిగా చదివిన పుస్తకాలు కాదు.. సృజనాత్మకత, తర్క శక్తి, భావ వ్యక్తీకరణ, సామాజిక తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు ఇవే మిగిలిన విలువలు, విజ్ఞాన భాండాగారాలు.
మన కీబోర్డులే ప్రపంచ సేవల కేంద్రాలై..
1990లలో, భారతదేశం ఐటీ బూమ్ అంచున ఉన్నప్పుడు, ఈ పరిశ్రమ దేశంలోనే అత్యంత ప్రపంచీకరణ చెందిన రంగంగా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. లక్షలాది మంది భార తీయులు కంప్యూటర్ స్క్రీన్‌ల ముందు కూర్చుని, కోడ్ రాస్తూ, ప్రపంచం ఉపయోగించే సాఫ్ట్‌వేర్ సేవలను తయారు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. పావు శతాబ్దం తర్వాత, ఈ రంగం తడబడటం ప్రారంభించింది. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఏర్పడింది కాదు. ఉత్పాదక కృత్రిమ మేధస్సు (Gen AI) వల్ల ఏర్పడిన పరిస్థితి. కొంతకాలంగా ఈ తిరోగమన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023లో అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు భారీ తొలగింపులను ప్రకటించాయి. ఖచ్చి తంగా, ఈ కంపెనీలు జనరేటివ్ ఏఐని స్వీకరిస్తాయి.
లక్షలాది ఐటీయన్లకు ఆశాజనకం.. కానీ
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్‌లు, మొత్తం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా, క్యాంపస్ నియామకాలను కూడా నిలిపివేసాయి. సంవత్సరాలుగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో పాటు, ఈ కంపెనీలు వేలాది ఇంజనీరింగ్ కళాశాలల నుండి పట్టభద్రులైన లక్షలాది మంది భారతీయులకు ఆశాజనకంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారత ఐటీ పరిశ్రమ ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2023లో, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.76 శాతం ప్రతికూల రాబడిని అందించింది, ఒకప్పుడు భారత సేవల ఆర్థిక వ్యవస్థకు ఆభరణంగా ఉన్న రంగాన్ని ఏఐ పెరుగుదల త్వరలోనే దెబ్బతీయడం ప్రారంభించవచ్చు. ప్రపంచం మరింత లాభదాయకమైన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి మారుతుందనే వాస్తవాన్ని భారత ఐటీ పరిశ్రమ విస్మరించకూడదు. ఇది చివరికి ఈ రంగంలో నియామకాలు ఎలా జరుగుతాయో ప్రభావితం చేస్తుంది.
విజ్ఞానవంతులదే రాజ్యం!
కానీ ఇప్పుడు కూడా చాలా మందిలో “సాఫ్ట్‌వేర్ మత్తు” తగ్గలేదు. ఒకసారి అయినా ఆన్ సైట్‌కి వెళ్లాలనే ఆశ, పెద్ద కంపెనీలో ఉద్యోగం అనే కల ఇంకా చాలామందిలో బలంగా ఉంది. కానీ ఆ డ్రీమ్ ట్రైన్ ఇప్పటికే చాలా దూరం వెళ్లి పోయింది. ఇప్పుడు బట్టీ మోడ్‌లో కష్టపడి చదివినా, డూప్లికేట్ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలకు అప్లయ్ చేసినా, ఏఐ ముందు మన పప్పులు ఉడకవు. రోబో ఒక గంటలో చేసే పని కోసం మనం మూడు రోజులు పట్టుకుంటే, కంపెనీలు మనల్ని ఎందుకు పెట్టుకుంటాయి? సాఫ్ట్‌వేర్ స్వర్ణ యుగం ముగిసింది. ఇప్పుడు నిజమైన వి”జ్ఞానవంతులదే” రాజ్యం!”
మనమేం నేర్చుకోవాలి?
ఇప్పుడు విద్యార్థులు ఏఐ చేయలేని పనులు నేర్చుకోవాలి. (Strategy, Team Leadership, Creative Thinking, Innovation, Start ups)లలో ప్రత్యేకత ఉండాలి. జతగా కాకుండా భిన్నంగా కనిపించాలి. కోళ్ల ఫార్మ్స్ లాంటి కాలేజీ చదువులు ఇంకా పనికిరావు. బేసిక్స్ బలంగా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. (Communication, Emotional Intelligence, Adaptability, Strategy) అవసరం.
అదే మాయలో బతుకుతామంటే…
తెలుగు యువత ఇప్పటికైనా “గాజు కలల” మత్తు నుంచి బయట పడాలి. అమెరికా డాలర్లు, ఆన్‌సైట్ ఫోటోలు, లింక్డ్‌ఇన్ పోస్టులు ఇవన్నీ ఇప్పుడు మాయమయ్యే పరిస్థితి. సాఫ్ట్‌వేర్ రంగం ఇంకలేదని కాదు.. కానీ ఇప్పుడు అక్కడ ఉండాలంటే జ్ఞానం, నైపుణ్యం, సమర్థత, వినూత్న పంథా తప్ప మరో దారి లేదు. అంతా కోల్పోయామన్న భయం వద్దు.. మార్పు ఒక అభివృద్ధికి చిహ్నం. నిరంతరం ప్రయత్న లోపం లేకుండా, వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, సృజనాత్మక ఆలోచనలకు మెరుగు పెడితే మనకి ఎదురే లేదు. కానీ ఇంకా అదే పాత ధోరణిలో, మాయలో బతుకుతామంటే జీవితం కోల్పోతామనేది మాత్రం నిజం! అందుకే పదండి.. పోటీ పడండి.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.. నీకైనా.. నాకైనా ఎవరికైనా వుండే టైం రోజుకు 24 గంటలే..
































