క్రెడిట్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ అర్హతను నిర్ణయించే కీలకమైన అంశంగా ఉంటుంది. భారతదేశంలో సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్వీఫ్యాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌లను కేటాయిస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్ అంటే 750 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అనుకూలమైన నిబంధనలతో రుణాలు, క్రెడిట్ కార్డులను పొందే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ స్కోరు రుణ తిరస్కరణలకు లేదా అధిక వడ్డీ రేట్లకు రుణాలను పొందాల్సి వస్తుంది. రుణాలు లేదా క్రెడిట్ కార్డులపై సకాలంలో చెల్లింపులు జరగకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక్క ఈఎంఐ చెల్లింపు తప్పినా స్కోరు గణనీయంగా తగ్గుతుంది. ఒక వ్యక్తి తరచుగా తమ క్రెడిట్ పరిమితిని గరిష్టంగా దాటితే లేదా వారికి అందుబాటులో ఉన్న క్రెడిట్‌లో 30-40 శాతం కంటే ఎక్కువ ఉపయోగిస్తే అది క్రెడిట్‌పై అధిక ఆధారపడటాన్ని సూచిస్తుంది. ఇది స్కోరును తగ్గిస్తుంది.
తక్కువ వ్యవధిలో మల్టీ లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. రుణాలు తిరిగి చెల్లించకపోవడం లేదా రుణాల సమస్యలు పరిష్కరించకపోవడం క్రెడిట్ హిస్టరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు, క్రెడిట్ రిపోర్ట్‌లోని తప్పుడు సమాచారం, మిస్‌డ్ పేమెంట్, అన్‌నోన్ లోన్స్ వంటివి స్కోర్‌ను తగ్గించవచ్చు. ఎలాంటి క్రెడిట్ (రుణాలు లేదా క్రెడిట్ కార్డులు) లేకపోవడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ ఖాతాలను నిరంతరం తెరవడం, మూసివేయడం వల్ల క్రెడిట్ ప్రవర్తనలో అస్థిరత ఏర్పడుతుంది, ఇది స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం ఇలా
బిల్లుల చెల్లింపు
ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, యుటిలిటీ బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల సానుకూల క్రెడిట్ హిస్టరీ క్రియేట్ అవుతంది. ఏదైనా ఈఎంఐ పెండింగ్‌లో ఉండి, గడువు దాటితే, వీలైనంత త్వరగా దాన్ని క్లియర్ చేయాలి.
క్రెడిట్ వినియోగ నిష్పత్తి
ఆదర్శవంతంగా, బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగాన్ని చూపించడానికి తమ క్రెడిట్ వినియోగాన్ని అందుబాటులో ఉన్న పరిమితిలో 30 శాతం కంటే తక్కువగా ఉంచుకోవాలి.
క్రెడిట్ రిపోర్ట్
క్రెడిట్ రిపోర్ట్‌లను కాలానుగుణంగా తనిఖీ చేయడం వల్ల స్కోర్‌ను ప్రభావితం చేసే లోపాలను గుర్తించి సరిదిద్దవచ్చు.
రుణ దరఖాస్తులు
అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల మల్టీ ఎంక్వైరీలను నివారించవచ్చు. తద్వారా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
క్రెడిట్ ఖాతాలు
పాత క్రెడిట్ కార్డులను తెరిచి ఉంచడం (ఉపయోగంలో లేకపోయినా) సుదీర్ఘ క్రెడిట్ చరిత్రను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
సెటిల్‌మెంట్‌లు, డిఫాల్ట్‌లు
రుణాన్ని డిఫాల్ట్ చేస్తే స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని నివారించడానికి రుణదాతతో తిరిగి చెల్లించే ప్రణాళికలను పునర్నిర్మించడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.