ఫోన్ మెమరీ త్వరగా నిండిపోతోందా? వాట్సాప్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చి చూడండి

ఈ రోజుల్లో వాట్సాప్ లేనిదే రోజు గడవని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఇది నిత్యావసర యాప్ అయిపోయింది. పర్సనల్ చాటింగ్స్ నుంచి బిజినెస్ కబుర్ల దాకా, రోజుకి ఎన్ని ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేస్తామో లెక్కే లేదు.


కానీ ఒక్కోసారి ఇవే మీడియా ఫైల్స్ మనకు తెలియకుండానే ఫోన్ స్టోరేజ్ మొత్తం నింపేస్తాయి.

దీనికి కారణం వాట్సాప్‌లోని ‘మీడియా విజిబిలిటీ’ అనే ఒక సెట్టింగ్. అది ఎలా మీ స్టోరేజ్ నింపుతుందో, దాన్ని ఎలా మార్చుకుంటే ఫోన్ స్టోరేజీ మిగులుతుందో చాలా సులభమైన పద్ధతిలో తెలుసుకుందాం. దీనిని మార్చుకోవడం చాలా సులభం. ఆ స్టెప్స్ కూడా మేం కింద అందిస్తున్నాను.

* అసలు ఈ మీడియా విజిబిలిటీ ఏంటి?

వాట్సాప్‌లో మీడియా విజిబిలిటీ’ ఫీచర్ ఏం చేస్తుందంటే, మీకు ఎవరైనా ఫోటోలు, వీడియోలు పంపిస్తే వాటిని ఆటోమేటిక్‌గా ఫోన్ గ్యాలరీలో సేవ్ చేస్తుంది. చూడటానికి ఇది చాలా సౌకర్యంగా అనిపించొచ్చు. కానీ చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే, లేదంటే మీకు చాలా మీడియా వస్తుంటే, ఫోన్ స్టోరేజ్ నిండిపోతుంది.

మీమ్స్, ఫార్వర్డ్ మెసేజ్‌లు, ఏదో వీడియోలు.. ఇలా మీరు చూడకుండానే అన్నీ సేవ్ అయిపోతాయి. టైమ్ గడిచే కొద్దీ మీ గ్యాలరీ మొత్తం అవసరం లేని మీడియా ఫైల్స్ తో నిండిపోతుంది, ఫోన్ స్టోరేజ్ తగ్గిపోతుంది. దీనివల్ల మొబైల్ స్లో అవుతుంది. ఇంకా చాలా సమస్యలు వస్తాయి.

* వాట్సాప్ వల్లే స్టోరేజ్ నిండిపోతుందా?

స్టోరేజ్ ఫుల్ కావడం, ఫోన్ స్లో అయిపోవడానికి వాట్సాప్ మీడియానే కారణం కావచ్చు. మీరు చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ > స్టోరేజ్ > యాప్స్ > వాట్సాప్‌కి వెళ్లాలి. ఇక్కడ వాట్సాప్ ఎంత స్పేస్ వాడుతుందో చూపిస్తుంది. చూస్తే మీకే తెలుస్తుంది, వాట్సాప్ మీడియానే మీ స్టోరేజ్‌లో పెద్ద భాగం ఆక్రమించి ఉంటుంది.

* అన్ని చాట్స్‌కి ఎలా నిలిపేయాలి..?

వాట్సాప్ మీడియా ఆటోమేటిక్‌గా గ్యాలరీలో సేవ్ అవ్వడం మొత్తం ఆపేయాలంటే ఇలా చేయండి. ముందుగా వాట్సాప్ అప్లికేషన్ తెరవాలి. పైన కుడివైపు మూలన ఉన్న మూడు చుక్కలు (మెనూ) నొక్కాలి. సెట్టింగ్స్ > చాట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియా విజిబిలిటీ అని ఉంటుంది, దాన్ని నిలిపివేయాలి (Turn off).

వాట్సాప్‌లో జనవరిలో ఈ అదిరిపోయే ఫీచర్లు వచ్చేశాయ్.. ఇంకా రాబోయేవి చూస్తే ఫిదా అవుతారు!

అంతే, ఇకపై కొత్త మీడియా ఏదీ మీ గ్యాలరీలో సేవ్ అవ్వదు, అనవసర స్టోరేజ్ వాడకం తగ్గుతుంది. కొన్ని కాంటాక్ట్స్ లేదా గ్రూప్స్ నుంచి వచ్చే మీడియా మాత్రమే సేవ్ అవ్వకుండా ఆపాలనుకుంటే ఆ చాట్ ఓపెన్ చేయాలి. పైన కాంటాక్ట్ పేరు మీద నొక్కాలి.

కిందకి స్క్రోల్ చేస్తే మీడియా విజిబిలిటీ కనిపిస్తుంది, దాని మీద నొక్కాలి. “నో” అని సెలెక్ట్ చేయాలి. స్పామ్ ఎక్కువగా వచ్చే గ్రూప్స్ లేదా ఎక్కువ మీడియా పంపించే వాళ్ల కారణం మొబైల్‌లో తక్కువ స్టోరేజీ సమస్యలు రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది.

* మరికొన్ని చిట్కాలు

చాట్ స్టోరేజ్ క్లియర్ చేయాలి. వాట్సాప్ > సెట్టింగ్స్ > స్టోరేజ్ అండ్ డేటా > మేనేజ్ స్టోరేజ్ కి వెళ్లండి. ఇక్కడ మీరు పెద్ద ఫైల్స్ డిలీట్ చేయొచ్చు లేదా ఏదైనా చాట్ నుండి మీడియా క్లియర్ చేయొచ్చు. కొన్ని చాట్స్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేయొచ్చు.

ఇది పెట్టిన టైమ్ తర్వాత మీడియా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అలాగే మీ మీడియాను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌కి రెగ్యులర్‌గా బ్యాకప్ చేసుకొని, మీ ఫోన్ నుంచి డిలీట్ చేయాలి. ఈ మీడియా విజిబిలిటీ సెట్టింగ్ నిలిపివేయడమే కాకుండా, ఈ టిప్స్ పాటిస్తే, మీ ఫోన్ స్టోరేజ్ నింపకుండా ఫ్రీగా ఉంచుకోవచ్చు, మీ ఫోన్ మంచిగా పనిచేస్తుంది.