కరోనా సమయంలో ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదలైంది. వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత చాలా కంపెనీలు హైబ్రిడ్ మోడల్ ఫాలో అయ్యాయి. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును ఐటీ కంపెనీలన్నీ క్రమంగా వెనక్కి తీసుకుంటున్నాయి.
దశలవారీగా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులు వారంలో మూడు రోజులు కచ్చితంగా ఆఫీసు నుంచి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పాయి. ఈ విషయంలో TCS మాత్రం మరో అడుగు ముందుకేసింది. వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేననే నిబంధన విధించింది. పైగా అటెండెన్స్‌కు, వేరియబుల్ పేకు లింకు పెట్టింది. దీంతో అందరూ ఆఫీసుకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది.
నిబంధనలు కఠినతరం
తాజాగా ఆఫీసు నుంచి పనిచేయాలనే (Work From Office) నిబంధనలను TCS మరింత కఠినతరం చేసింది. ఆఫీసుకు రావడం నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపుల విషయంలో మార్పులు చేసింది. ఇక నుంచి ఒక క్వార్టర్‌లో కేవలం ఆరు రోజులు మాత్రమే మినహాయింపు కోరేందుకు అవకాశం ఇచ్చింది. పైగా ఒకవేళ వాటిని వాడుకోకపోతే, తదుపరి క్వార్టర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేది ఉండదని స్పష్టం చేసింది. అలాగే నెట్‌వర్క్ సంబంధింత సమస్యలను పేర్కొంటూ మ్యాగ్జిమం ఐదు ఎంట్రీల వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది. పైగా వాటిని 10 రోజుల్లోగా హయ్యర్ అథారిటీస్ ప్రాసెస్ చేయకపోతే ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతాయని తెలిపింది.
రెండు రోజులు దాటితే!
ఏవైనా మినహాయింపులకు సంబంధించిన అప్రూవల్ రిక్వెస్ట్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని టీసీఎస్ తమ ఉద్యోగులకు పంపిన నోటీసులో స్పష్టం చేసింది. గరిష్ఠంగా రెండు రోజులు దాటితే అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. అలాగే మిస్సయిన WFO ఎంట్రీ కేటగిరీలను రాబోయే నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఉద్యోగుల మధ్య సహకారం కీలకం
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని అప్‌డేట్ చేయడంతో పాటు పాజిటివ్ వర్క్‌ప్లేస్ ఎన్విరాన్‌మెంట్‌ను పెంపొందించాల్సిన అవసరం ఉందని TCS హెచ్‌ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగుల విషయంలో కంపెనీ నిజాయతీతో కూడిన ఫీడ్‌బ్యాక్‌ను అందించాలని మేనేజర్లకు సూచించింది. ఉద్యోగుల మధ్య మంచి సమన్వయాన్ని క్రియేట్ చేయాలని తెలిపింది. ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేసే వాతావరణం కల్పించాలని సూచించింది.
వేరియబుల్ పేలో మార్పులు
క్వార్టర్లీ ఫలితాలు ప్రకటిస్తూ ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేరియబుల్ పే ఇవ్వనున్నట్లు TCS తెలిపింది. మిడ్, సీనియర్ లెవెల్‌లో ఉన్నవారికి మాత్రం కంపెనీ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులు ఆఫీసుకు రావడంపై శ్రద్ధ వహిస్తారని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి కంపెనీ కార్యకలాపాలు గాడిన పడ్డ తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని పునఃసమీక్షిస్తామని మిలింద్ పరోక్ష సంకేతాలిచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు.
క్వార్టర్లీ రిజల్ట్స్
డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో TCS రూ.12,380 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 11.95 శాతం అధికం. సెప్టెంబరు త్రైమాసికంలో రూ.11,909 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం రూ.60,583 కోట్ల నుంచి రూ.63,973 కోట్లకు చేరింది. 5.6 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబరు త్రైమాసికంలో ఇది రూ.64,259 కోట్లుగా ఉంది. ఒక్కో షేరుకు రూ.10 ఇంటెరిమ్ డివిడెండ్‌ను ప్రకటించారు. రూ.66 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను కూడా ఇస్తామన్నారు. మొత్తం కలిపి ఒక్కో షేరుపై రూ.76 చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు జనవరి 17ను రికార్డు తేదీగా నిర్ణయించారు. 2024-25లో 40,000 మందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలనే ప్లాన్ కొనసాగుతోందని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది అంతకంటే ఎక్కువ మందిని తీసుకుంటామని వెల్లడించింది.