హైబీపీ. ఇప్పుడు ఈ సమస్య చాలా మందిని వేధిస్తోంది. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు హైబీపీ వచ్చేందుకు కారణం అవుతున్నాయి.
హైబీపీ ఉన్నవారు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని.. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
హైబీపీ ఉన్నవారు కచ్చితంగా ఉప్పును పూర్తిగా తగ్గించాలి. ఉప్పును తక్కువగా తీసుకోవడం తోపాటు ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది. హైబీపీ ఉన్న వారు టీ, కాఫీలను తాగడం పూర్తిగా తగ్గించాలి. టీ, కాఫీల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది బీపీని కాసేపు పెంచుతుంది. కనుక సాధారణ వ్యక్తులకు ఏమీ అవదు. కానీ హైబీపీ ఉన్నవారికి మాత్రం ఇది చేటు చేస్తుంది. అందుకు బదులుగా హెర్బల్ టీలను తాగితే మేలు జరుగుతుంది. హైబీపీ ఉన్నవారు ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రాజెన్ ఫుడ్స్, పిజ్జాలు వంటి ఆహారాల జోలికి వెళ్లకూడదు. ఇవి హైబీపీ ఉన్నవారికి అసలు ఏమాత్రం మంచివి కావు. అలాగే బిస్కెట్లు, కుకీస్, కేక్స్, పై, డో నట్స్, చిప్స్, క్రాకర్స్, మైక్రోవేవ్ పాప్ కార్న్ వంటి బేకరీ ఉత్పత్తులను సైతం తినకూడదు. వీటిల్లో సోడియం, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బీపీ ఉన్నవారికి చేటు చేస్తాయి. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు ఈ ఆహారాలను కూడా తినకూడదు.
ఇక బీపీ ఉంటే మద్యం, ధూమపానంకు దూరంగా ఉండాలి. వీటి వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో, హైబీపీ ఉన్నవారు ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. కాగా..ఇక హైబీపీ ఉన్నవారు పండ్లు, కూరగాయలను అధికంగా తినాల్సి ఉంటుంది. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించేందుకు సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బెర్రీలు, అరటి పండ్లు, పాల కూర, చిలగడ దుంపలు, బీట్ రూట్ వంటి వాటిల్లో ఆయా పోషకాలు అధికంగా ఉంటాయి. వాటిని తింటుంటే మేలు జరుగుతుంది. అలాగే ఓట్ మీల్, బ్రౌన్ రైస్, కినోవా, కొవ్వు లేని పెరుగు, చేపలు, బీన్స్, పప్పు దినుసులు, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్ వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. హైబీపీ ఉన్నవారు ఇలా ఆహారాల విషయంలో మార్పులు చేసుకుంటే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
































