మనదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త కారు కొనాలనుకునే వారి ప్రాధాన్యతల్లో ఈ తరహా కార్లు ఒకటిగా ఉంటున్నాయి.
తక్కువ ధరలో ఎస్‌యూవీ లుక్‌లో కారు అందుబాటులో ఉండడమే దీనికి ప్రధాన కారణం. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉండడంతో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ సెగ్మెంట్లో తమ కార్లను విక్రయిస్తున్నాయి. వీటిలో మహీంద్రా కూడా ఒకటి.
మహీంద్రా కంపెనీ ఈ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) కారును విక్రయిస్తోంది. ఈ కారు ప్రతి నెలా అద్భుతమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తోంది. 2025 ఏప్రిల్ కూడా దీనికి మినహాయింపు కాదు.
2025 ఏప్రిల్‌లో ఏకంగా 7,568 మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కార్లు అమ్ముడయ్యాయి. అయితే, గత 2024 ఏప్రిల్‌లో ఈ సంఖ్య కేవలం 4,003 మాత్రమే. అంటే గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 3,565 ఎక్కువ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కార్లు అమ్ముడయ్యాయి.
ఇది దాదాపు 89 శాతం వృద్ధి అన్నమాట. అంటే అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో 2025 ఏప్రిల్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎస్‌యూవీ కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ 9వ స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza), టాటా నెక్సాన్ (Tata Nexon), హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue), కియా సోనెట్ (Kia Sonet) వంటి కార్లకు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ అమ్మకాల పరంగా పెద్ద ముప్పుగా పరిణమించింది.
ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే, పనోరమిక్ సన్‌రూఫ్, 7 స్పీకర్ హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, 80కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 26.03 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి చాలా ముఖ్యమైనవి.
అంతేకాకుండా, ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో ఉన్నాయి. అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సేఫ్టీ ప్యాకేజీ కూడా ఈ కారులోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ లేటెస్ట్ ఫీచర్లతో ఉండటమే కాకుండా, అత్యంత సురక్షితమైన కారు కూడా. భారత్ ఎన్‌సిఏపి (Bharat NCAP)క్రాష్ టెస్టుల్లో పిల్లలు, పెద్దల భద్రత విషయంలో ఈ కారు పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పవర్ఫుల్ 3 ఇంజన్ ఆప్షన్లతో కూడా లభిస్తుంది. అవి 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ టిజిడిఐ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్.
ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో కూడిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారు ప్రారంభ ధర ప్రస్తుతం కేవలం 7.99 లక్షల రూపాయలు మాత్రమే. టాప్ వేరియంట్ ధర 15.79 లక్షల రూపాయలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: అత్యాధునిక ఫీచర్లు, సేఫ్టీ, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లు ఇలా వినియోగదారులు కోరుకునే అన్ని అంశాలు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో ఉన్నాయి. అంతేకాకుండా ధర కూడా సరైన స్థాయిలో నిర్ణయించబడింది. దీని కారణంగానే ఈ కారు అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.
































