Tech News: ప్రస్తుతం టెక్కీలు తమ రంగంలోని సమస్యలతో పాటు ఇతర విషయాల వల్ల సైతం భారీగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో బెంగళూరులో నివసిస్తున్న టెక్కీలు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు.
గత కొంత కాలంగా ఓవర్ క్రౌడెడ్ కర్ణాటక రాజధాని సిలికాన్ వ్యాలీ, టెక్ కంపెనీల డెస్టినేషన్‌గా ఉన్న బెంగళూరు నగరాన్ని తీవ్ర నీటి ఎద్దడి వెంటాడుతోంది. వేసవి ప్రారంభమైన కొద్ది వారాల్లోనే నీటి కటకటలు సామాన్య ప్రజల నుంచి పెద్దపెద్ద మాల్స్ వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు నగరంలో నివసిస్తున్న, స్థిరపడిన టెక్కీలకు చేదు వార్త ఒకటి బయటకు వచ్చింది. దీంతో కర్ణాటకలో మరో నగరాన్ని కొత్త ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే బెంగళూరులోని పరిస్థితితో కేరళ ప్రభుత్వంలోని మంత్రులు టెక్ కంపెనీలను ఆకర్షించేందుకు మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే అటు ఐటీ కంపెనీలు సైతం నీటి కొరత, ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇటీవల బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర నగరాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. అలా అందరి దృష్టి ప్రస్తుతం మంగళూరుపై పడింది. ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా ఉన్న మంగళూరులో ఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఇన్వెంచర్ టెక్నాలజీ వంటి ప్రధాన కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభించాయి. ఇటీవలే టెక్ మహీంద్రా తన శాటిలైట్ కార్యాలయాన్ని మంగళూరులో ప్రారంభించింది. దీంతో వివిధ బడా కంపెనీల దృష్టి మంగళూరు వైపు మళ్లింది. రాబోయే కొన్నేళ్లలో ఇక్కడ నాలుగైదు ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయని సమాచారం.
ఇదే క్రమంలో కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వం మంగళూరులో కార్యాలయాల ఏర్పాటుకు తోడ్పాటుతో పాటు రాయితీలను అందించాలని కోరుతున్నారు. అలాగే మంగళూరు ప్రాంతంలోని విద్యా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందించడంపై దృష్టి సారిస్తున్నాయి. రాబోయే కొన్నేళ్లలో ఈ రంగాల్లో అత్యుత్తమ స్కిల్ కలిగిన టెక్కీలు ఉన్న నగరాల్లో ఒకటిగా మంగళూరు రూపుదిద్దుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే తీరప్రాంత నగరం త్వరలోనే దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌గా మారనుందని తెలుస్తోంది. తాజా నిర్ణయం కొందిరికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రానున్న కాలం కోసం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం సానుకూల ఫలితాలను అందించనుందని తెలుస్తోంది.