HCL Tech News: ఇటీవల దేశంలోని టెక్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా కాలం విరామం తర్వాత టెక్ కంపెనీలు నియామకాలను తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాయి.
వీటికి సంబంధించిన తమ ప్లాన్స్ బయటపెడుతున్నాయి.
టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ త్వరలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రెషర్‌లను గత ఏడాది మాదిరిగానే రిక్రూట్‌మెంట్ వ్యూహాన్ని అనుసరించి నియమించుకోవాలని కంపెనీ చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీ 12,141 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంది.
ఈసారి నియమించుకోనున్న 10,000 మంది ఫ్రెషర్ల విషయంలో నిర్దిష్ట నిబంధనల ప్రకారం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుందని హెచ్‌సీఎల్‌టెక్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ పేర్కొన్నారు. ఈ నియామకాలు FY25కి అదనం. కంపెనీ అవసరాలకు అనుగుణంగా కొత్త ఫ్రెషర్లను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. అయితే వీరిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పదవీకాలం ముగిసే సమయానికి వారి నైపుణ్యాల ప్రకారం వారు మళ్లీ కాంట్రాక్ట్ చేయవచ్చన్నారు.
కొత్త టాలెంట్‌ని తీసుకురావడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. ఈ చర్య ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు పటిష్టం చేయగలుగుతుందన్నారు. సంస్థలోని పనిలో మరింత వేగం తీసుకురావడంలో వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపార అనిశ్చితుల్లో ఇతర టెక్ కంపెనీలు సైతం హెచ్‌సీఎల్‌టెక్ మాదిరిగానే ఉద్యోగులను కాంట్రాక్ట్ ప్రాతిపధికన నియమించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.