అమరావతి: ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంగా సభకు రాకూడదనే ఆలోచన సరికాదని వైకాపా అధినేత జగన్‌కు తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సూచించారు. సోమవారం జగన్ శాసనసభలోకి ప్రవేశించి సభ్యులకు నమస్కారం చేసుకుంటూ వెళ్తుండగా రఘురామకృష్ణరాజు తన సీటు నుంచి లేచివచ్చి ఆయన్ను పలకరించారు. జగన్ తన సీటులోకి వెళ్లి కూర్చున్న తర్వాత మళ్లీ ఆయన వద్దకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడారు. తనను సీఐడీ పోలీసులతో కొట్టించారని ఇటీవల జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టిన రఘురామకృష్ణరాజు శాసనసభలో జగన్ వద్దకు వెళ్లి భుజంపై చేయి వేసి మరీ మాట్లాడటంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. ‘అసలు ఆ హోదాతో పనేముంది. ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు. మీ పార్టీ శాసనసభా పక్షానికి నాయకుడు మీరే. ఆ హోదాలో రండి. ప్రతిపక్ష నేత హోదా అనే ఆలోచన నుంచి బయటకువచ్చి సభా సమావేశాలకు కచ్చితంగా రండి’ అని రఘురామ జగన్‌కు తెలిపారు. జగన్‌తో ఏం మాట్లాడారని ‘ఈనాడు’ ప్రతినిధి అడగ్గా.. రఘురామకృష్ణరాజు పైవివరాలు వెల్లడించారు. తప్పకుండా సభకు వస్తానని జగన్ తనకి చెప్పారని పేర్కొన్నారు.