గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, మీ కార్యాలయం నుంచి ఫారం-16 అందిందా? ప్రస్తుత మదింపు సంవత్సరం (2025-26)కు గాను రిటర్నులు దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారా?
ఇది మీ కోసమే..
పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి కొత్త నిబంధనలు కొంత సవాలుగా మారుతున్నాయి. పారదర్శకతను పెంచడం, తప్పుడు క్లెయిములను నివారించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను విభాగం వీటిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు చేసేప్పుడు ప్రతి మినహాయింపును రుజువులతో వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొత్త పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారు ఎలాంటి మినహాయింపులూ చూపించాల్సిన అవసరం ఉండదు.
వేతనం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఉద్యోగులు తమ యాజమాన్యం అందించిన ఫారం-16 ఆధారంగా ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేయడానికి వీలుండేది. ఈసారి నుంచి సెక్షన్ 80సీ, 80డీ, 80డీడీ, 80యూ, ఇంటి అద్దె భత్యంలాంటి వాటికి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి లేకపోతే, ఆ క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావచ్చు. తప్పుడు ధ్రువీకరణలు ఇస్తే, ఆదాయపు పన్ను రిటర్నులను ఆమోదించకపోవచ్చు.
గృహరుణం ఉంటే..
గృహరుణం తీసుకున్న వారు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(బి) ప్రకారం రూ.2లక్షల వరకూ వడ్డీకి మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. గతంలో వడ్డీ మొత్తాన్ని తెలియజేస్తే సరిపోయేది. ఇప్పుడు రుణం ఎక్కడి నుంచి తీసుకున్నారు? లోన్ అకౌంట్ నంబరు, రుణం తీసుకున్న తేదీ, ఎంత మొత్తం? ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది? వడ్డీ ఎంత చెల్లించారు? ఈ వివరాలన్నీ ఇవ్వాల్సిందే. అప్పుడే ఈ సెక్షన్ కింద వడ్డీ మినహాయింపు సాధ్యం అవుతుంది. మీ రుణం ఉన్న బ్యాంకు/ఆర్థిక సంస్థ నుంచి ఈ వివరాలను తీసుకోండి.
ఆరోగ్య బీమా..
ఆదాయపు పన్ను సెక్షన్ 80డీ ప్రకారం ఆరోగ్య బీమా ప్రీమియానికి చెల్లించిన ప్రీమియానికి రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమా ప్రీమియానికీ మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. ఇక్కడ మరో కొత్త నిబంధన వచ్చింది. మీరు ఎక్కడి నుంచి పాలసీ తీసుకున్నారు? పాలసీ నంబరును కచ్చితంగా తెలియజేయాల్సిందే.
సెక్షన్ 80డీడీ
తనపై ఆధారపడిన దివ్యాంగుల పోషణ, వైద్య చికిత్స అవసరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుడు ఈ సెక్షన్ కింద మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. ఈ మొత్తం సాధారణ వైకల్యం ఉంటే రూ.75,000, తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.1,25,000 వరకూ వర్తిస్తుంది. ఆధారపడిన వారి పాన్, ఆధార్ వివరాలు ఇవ్వాలి. దీంతోపాటు 10ఏఐ ధ్రువీకరణా అవసరం.
విద్యారుణం ఉందా?
ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యా రుణంపై చెల్లించిన వడ్డీకి సెక్షన్ 80ఈ ప్రకారం ఎలాంటి పరిమితి లేకుండా మినహాయింపు వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని నమోదు చేయాలంటే.. రుణం ఎక్కడి నుంచి? ఎంత? తీసుకున్న తేదీ, ఇంకా ఎంత బాకీ ఉన్నారు? చెల్లించిన వడ్డీ ఎంత?లాంటివన్నీ పేర్కొనాలి. గతంలో కేవలం చెల్లించిన వడ్డీ వివరాలు వెల్లడిస్తే సరిపోయేది.
విద్యుత్ వాహనం..
విద్యుత్ వాహనాన్ని (ఈవీ) ఏప్రిల్ 1, 2019- మార్చి 31, 2023 మధ్య కొన్నప్పుడు దాని రుణానికి చెల్లించిన వడ్డీని సెక్షన్ 80ఈఈబీ కింద చూపించుకోవచ్చు. ఇది గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ అనుమతిస్తుంది. గృహరుణం, విద్యారుణం మాదిరిగానే అన్ని వివరాలూ తెలియజేయడంతోపాటు, వాహన రిజిస్ట్రేషన్ నంబరును ఇక్కడ నమోదు చేసినప్పుడే మినహాయింపు వర్తిస్తుంది.
సెక్షన్ 80సీ..
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో ప్రధాన సెక్షన్ ఇది. ఈపీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా ప్రీమియాలు, ఇంటి రుణానికి చెల్లించిన అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు తదితరాలన్నీ ఇందులో వస్తాయి. వీటిని క్లెయిం చేసుకునేందుకూ ధ్రువీకరణలు ఉండాల్సిందే. బీమా ప్రీమియం క్లెయిం కోసం పాలసీ సంఖ్య నమోదు చేయాలి.
- ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) క్లెయిం చేసుకునేందుకు ఫారం 10బీఏ అక్నాలడ్జ్‌మెంట్ నంబరును తెలియజేయాలి.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త, పాత పన్ను విధానంలో మీకు ఏది లాభమో ఒకసారి చూసుకోండి.
ఆ తర్వాతే రిటర్నులను సమర్పించండి. ఈ మార్పుల నేపథ్యంలోనే ఆదాయపు పన్ను విభాగం రిటర్నుల గడువును సెప్టెంబరు 15 వరకూ పొడిగించింది.
































