YS Jagan: ఈసారి అసెంబ్లీకి హాజరుపై తేల్చేసిన జగన్ ! సేమ్ సీన్ రిపీట్ ?

www.mannamweb.com


YS Jagan: ఈసారి అసెంబ్లీకి హాజరుపై తేల్చేసిన జగన్ ! సేమ్ సీన్ రిపీట్ ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధిస్తే విపక్ష వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో తొలి అసెంబ్లీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయక తప్పదు కాబట్టి ఆ సమావేశానికి హజరైన జగన్… ప్రమాణం పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో నరికి చంపేశారు. దీంతో ఇవాళ వినుకొండ వెళ్లి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్…అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానున్నట్లు జగన్ వెల్లడించారు.

జూలై 22న సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఆ తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి నిరసన చేపడతామని జగన్ తెలిపారు. అయితే గతంలో తొలి సెషన్ సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అదీ గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.