Andhra News: జగన్‌ భక్త ఐపీఎస్‌ అధికారులపై వేటు

www.mannamweb.com


ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా రాజేంద్రనాథరెడ్డి
పీవీ సునీల్‌కుమార్, రిషాంత్‌ రెడ్డిలకు పోస్టింగే లేదు
వైకాపా నాయకుల అరాచకాలకు కొమ్ముకాశారనే ఫిర్యాదులు

అమరావతి: జగన్‌ ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాసిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర డీజీపీగా ఉంటూ మొత్తం పోలీసు వ్యవస్థనే వైకాపా అనుబంధ విభాగంగా మార్చేసిన ప్రస్తుత ఏసీబీ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేసింది.

సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధించారనే ఫిర్యాదులున్న ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు పోస్టింగే ఇవ్వలేదు. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిలా ఉంటూ చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకుల దాష్టీకాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రస్తుత కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ రిషాంత్‌రెడ్డికీ ఏ పోస్టింగూ ఇవ్వలేదు. ఆయన్ను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీఎస్పీ బెటాలియన్స్‌ అదనపు డీజీ అతుల్‌సింగ్‌కు ఏసీబీ డీజీగా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీకి అగ్నిమాపక శాఖ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.