అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ‘జగనన్న’ పేరుతో అమలైన పలు పథకాలకు.. దేశానికి విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డలైన సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్‌కలాం, నిరతాన్నశీలి డొక్కా సీతమ్మ పేర్లు పెట్టనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా.. సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయా పథకాల పేర్లను మార్చినట్లు పేర్కొన్నారు.
కొత్త పేర్లు స్ఫూర్తినిస్తాయి: పవన్
భావితరాలకు స్ఫూర్తినిచ్చే సమాజసేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాల్ని అమలుచేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆ మహనీయుల ఆశీస్సులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఉంటాయని ఎక్స్ వేదికగా అభిలషించారు. ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, ఏపీజే అబ్దుల్‌కలాం పేర్లతో పథకాలు అమలుచేయాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, లోకేశ్‌లకు అభినందనలు. గత ప్రభుత్వంలో అన్ని పథకాలకూ జగన్.. తన పేరే పెట్టుకున్నారు. ఆ దుష్ట సంప్రదాయానికి తెరదింపి, విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే పేర్లుపెట్టడం శుభపరిణామం’ అని పేర్కొన్నారు. పవన్ పోస్టుపై స్పందించిన లోకేశ్.. ఈ పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలూ ప్రేరణగా నిలిచాయన్నారు. ‘పవనన్నకు ధన్యవాదాలు’ అని తెలిపారు.
పవన్‌కు ధన్యవాదాలు.. లోకేశ్‌కు అభినందనలు: సీఎం చంద్రబాబు
విద్యా శాఖలో అమలు చేసే పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, ఏపీజే అబ్దుల్‌కలాం వంటి స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడాన్ని స్వాగతించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆ పేర్లు ప్రతిపాదించిన విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ను ఎక్స్‌లో ఆదివారం ఆయన అభినందించారు. పవన్ కల్యాణ్ పోస్టును తన ట్వీట్‌కు జత చేశారు.