కౌంటింగ్ ముందే జగన్ సంచలన నిర్ణయం – ముఖ్య నేతలకు పిలుపు..!!
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన పార్టీ నేతలు జగన్ తో చర్చించారు.
జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని స్పష్టం చేసారు. కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేసారు. అదే సమయంలో ఫలితాల అంచనాలు..భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు. జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది.
జగన్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి జగన్ కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా రెండు రోజులు సమీక్ష చేసారు. పలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఐప్యాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని…ఖచ్చితంగా భారీ విజయం నమోదు రాబోతోందని జగన్ విశ్వాసం వ్యక్తం చేసారు.
పార్టీ శాసనసభా పక్షభేటీ
ఇదే సమయంలో జగన్ పార్టీ నేతలకు కీలక సూచన చేసారు. రేపు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో…గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ తరువాత ప్రతీ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని..ఎంపీ అభ్యర్దులతో సహా అందరూ తాడేపల్లిలో అందబాటులో ఉండాలని సూచించారు. అదే విధంగా ఇప్పటికే జూన్ 9న జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కేటాయించారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్స్ లో వేదిక ఖరారు చేసారు.
పూర్తి ధీమాతో జగన్
ఎగ్జిట్ పోల్స్..ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా…తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని జగన్ ధీమాగా చెబుతున్నారు. పోలింగ్ సరళి..ఎగ్జిట్ పోల్స్ తరువాత జగన్ చెప్పింది జరుగుతుందా లేదా అనే టెన్షన్ పార్టీ ముఖ్యుల్లో కనిపిస్తోంది. కానీ, జగన్ లో ధీమా మాత్రం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కార్యక్రమ లాంఛనం పూర్తి చేయటానికి ముహూర్తం కూడా సిద్దం చేసారు. దీంతో..అటు జగన్ విశ్వాసం..ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.