అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం అన్యాయమని జగన్ స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు.
అంతకు ముందు వైసీపీ నేతలందరూ అల్లు అర్జున్ అరెస్టు అక్రమం అని ఖండించారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు స్పందించారు. అదే సమయంలో జగన్కు, వైసీపీ నేతలకు ఆస్థాన న్యాయవాదులుగా పేరున్న నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అల్లు అర్జున్ ను జైలుకు వెళ్లకుండా బయటకు తెచ్చేందుకు న్యాయపోరాటం చేశారు.
పుష్ప సినిమా విడుదల సమయంలో కూడా వైసీపీ నేతలు ఆ సినిమాకు మద్దతుగా మాట్లాడారు. అంబటి రాంబాబు విడుదల తర్వాత సినిమా సూపర్ అని రివ్యూ కూడా చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ తో బన్నీకి దూరం ఉందన్న ప్రచారం కారణంగానే ఆయనను తమ దగ్గరకు చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. అల్లు అర్జున్ కు ఎప్పుడు సపోర్టు చేసే అవకాసం వచ్చినా వైసీపీ నేతలు అవసరం ఉన్నా లేకపోయినా ముందే ఉంటున్నారు. ఈ విషయంలో పవన్ ను టార్గెట్ చేస్తున్నామని వారంటున్నారు.
అలాగే నిరంజన్ రెడ్డి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ మంచి పేరున్న లాయర్. ఆయన తన వృత్తిలో భాగంగా నే అటు జగన్ కు.. ఇటు అల్లు అర్జున్ కోసం కూడా పని చేస్తున్నారని అంతే కానీ వైసీపీకీ సంబంధం లేదని చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం..అల్లు అర్జున్ అరెస్టు నుంచి గరిష్టంగదా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టును టీడీపీకి.చంద్రబాబుకు కూడా ముడి పెడుతున్నారు.