EVM లపై జగన్ సంచలన ట్వీట్‌- పేపర్ బ్యాలెట్లు వాడాలని డిమాండ్

www.mannamweb.com


EVM Controversy: ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు.

“న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో EVMలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి.” అని జగన్ ట్వీట్ చేశారు.

జూన్ 4న ఫలితాలు వచ్చిన రోజునే స్పందించిన జగన్ మోహన్ రెడ్డి… తాము ప్రజలకు ఎంతో మేలు చేశామని వాళ్లు వేసిన ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. చాలా అనుమానాలు ఉన్నప్పటికీ దానికి తగ్గ ఆధారాలు లేవని అన్నారు. అప్పటి నుంచి వైసీపీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు నేరుగా జగన్ మోహన్ రెడ్డే ఈవీఎంలపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది.

అయితే జగన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు అంతకు ముందు చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు జగన్ స్పీచ్‌లను వైరల్ చేస్తున్నారు. అప్పట్లో ఈవీఎంలను మ్యానుపులేట్ చేయవచ్చన్న చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. అసలు ఈవీఎంలలో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదని ఉదాహరణతో వివరించారు. ఎవరికి ఓటు వేస్తున్నామో వీవీ ప్యాట్‌లో కనిపిస్తుందని అన్నారు. ఒక వ్యక్తిత తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తే వీవీప్యాట్‌ స్లిప్‌లో వేరే పార్టీ గుర్తు కనిపిస్తే కచ్చితంగా ఆ వ్యక్తి ప్రశ్నిస్తారని అన్నారు. అలా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేదని గుర్తు చేశారు. అప్పట్లో చేసిన ఈ కామెంట్స్‌ను జగన్‌కు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.