YS Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రతిపక్ష హోదాపై జగన్‌ రకరకాల మాటలు

www.mannamweb.com


‘చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే 17/18 మంది అవుతారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు లాగేద్దాం అని కొందరన్నారు.. అలా చేసి ఉంటే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండేది కాదు. అక్కడ కూర్చుని ఉండేవారు కాదు’ అంటూ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా.. తనదైన అహంకార ధోరణితో నిండు సభలో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ మరీ మాట్లాడారు. ‘ఇదీ వాస్తవం.. తెలుసుకో’ అంటూ ఏకవచనంతో హుంకరించారు కూడా!

ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే అప్పట్లో తెదేపాకు 23 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురిని జగన్‌ లాగేసుకుని ఉంటే తెదేపాకు 18/17 మంది మిగిలేవారు. అయినా చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా రాదని సభలో చాలా గట్టిగా జగన్‌ ఏ లెక్కన చెప్పారు? సభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందనే ఉద్దేశంతో కాదా!

ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ.. తానే ప్రతిపక్ష నేతనని జగన్‌ చెబుతున్నారు. ఈ నెల 21న సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్రతిపక్ష నేతగా తనను ప్రమాణం చేయించకపోవడం తప్పని కూడా మంగళవారం స్పీకర్‌కు రాసిన లేఖలో నొక్కి వక్కాణించారాయన. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు. జగన్‌ విచిత్ర వాదన నేపథ్యంలో.. ‘సంప్రదాయాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయా? సంప్రదాయాలు అధికారంతో విర్రవీగినపుడు ఒకలా.. జన ఛీత్కారం పొందాక మరోలా ఉంటాయా?’ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.