టీమిండియాలో రికార్డులు అనగానే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనో లేదా కెప్టెన్ రోహిత్ శర్మనే అందరికీ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇప్పటి టీమ్‌లో బ్యాటింగ్‌లో మోస్ట్ రికార్డ్స్ వీళ్ల పేరు మీదే ఉన్నాయి. వరల్డ్ క్రికెట్లో ఎన్నో అన్బ్రేకబుల్ రికార్డ్స్‌ను ఈ ఇద్దరూ బ్రేక్ చేశారు. అయితే వీళ్ల దారిలోనే వెళ్తున్నాడో యంగ్‌స్టర్. టీమిండియాలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఎన్నో పాత రికార్డులకు పాతర పెడుతున్నాడు. తాజాగా మరో పాత రికార్డు బూజు దులిపాడు. అతడే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతడు చరిత్ర సృష్టించాడు. 51 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును అతడు బద్దలుకొట్టాడు. ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం చూద్దాం..
డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్.. 10 టెస్టుల్లోనే వెయ్యికి పైగా రన్స్ చేశాడు. తద్వారా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న ఆల్‌టైమ్ రికార్డ్‌ను అతడు బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. 17 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే విఫలమైనా గానీ ఈ ఇన్నింగ్స్‌తో ఓ అరుదైన ఘతన సాధించాడు. కెరీర్లో మొదటి పది టెస్టు మ్యాచుల్లో అత్యధిక రన్స్ చేసిన టీమిండియా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సునీల్ గవాస్కర్ (978 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. 51 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును అతడు బద్దలుకొట్టాడు. అలాగే ఓవరాల్ టెస్ట్ క్రికెట్లో తొలి పది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్ల క్లబ్లో చోటు సంపాదించాడు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ (1446 పరుగులు) టాప్‌లో ఉన్నాడు.
బ్రాడ్‌మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎవర్టన్ వీక్స్ (1125 పరుగులు), జార్జ్ హెడ్లీ (1102 పరుగులు) ఉన్నారు. వాళ్ల తర్వాత 1094 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు జైస్వాల్. ఇక, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన జైస్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసి నహీద్ రాణా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (17) కూడా రాణించలేదు. శుబ్‌మన్ గిల్ (33 నాటౌట్), రిషబ్ పంత్ (12 నాటౌట్) మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు. భారత్ ప్రస్తుతం 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 100 నుంచి 150 పరుగులు జోడిస్తే టీమిండియాను గెలవకుండా ఆపడం ఎవరి వల్లా కాదు. భారత్ జోరు చూస్తుంటే మూడు నుంచి మూడున్నర రోజుల్లోనే బంగ్లా కథ ముగించేలా ఉంది.