వైసీపీని వీడారు. జనసేనలో చేరారు. ముఖ్య నేతలు వచ్చి మిత్రపక్షంలో చేరినా ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవడం లేదెవరూ. చేరికలపై కూటమి నేతల్లో ఏకాభిప్రాయం లేదా?
అగ్రనేతల మధ్య బంధం బలంగానే ఉన్నా నియోజకవర్గాల్లో సఖ్యత సాధ్యమేనా? వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలు.. కొత్తచోట ఓ మెట్టు దిగుతారా? సమస్యలున్నా సర్దుకుపోతారా? అన్నదీ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
చేరికలు ఏపార్టీకైనా మంచిదే. కానీ ఎన్నికల ముందైతే ఆ లెక్క వేరే. వైసీపీ నుంచి చేరికల విషయంలో టీడీపీకో క్లారిటీ ఉంది. అందుకే కండువా మారుద్దామనుకునే నేతలు జనసేన వైపు చూస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే రాజకీయంగా మరింత బలపడాలని అనుకుంటున్న జనసేన ముఖ్యనేతల చేరికలకు తలుపులు తీసిపెట్టింది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యసహా మరికొందరు నేతలు పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
జనసేనలో చేరిన నేతలు టీడీపీ, బీజేపీలతో కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్నిచోట్ల అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. అందుకే జనసేన కూడా నొప్పించక తానొవ్వక అన్నట్లు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మామూలుగా అయితే మంది మార్బలంతో బలప్రదర్శనలా వచ్చే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సింపుల్‌గా రావడం ఆ జాగ్రత్తల్లో భాగంగానే కనిపిస్తోంది. బాలినేని చేరికను టీడీపీ ఎమ్మెల్యేనే కాదు.. ఒంగోలు జనసేన పార్టీలోనూ కొందరు వ్యతిరేకించారు. జనసేనలో చేరినా బాలినేనిని వదిలేదీ లేదంటూ దామచర్ల జనార్దన్ చేసిన హెచ్చరికలు కూటమిలో హాట్‌టాపిక్‌గా మారాయి.
బాలినేనితో పాటు జనసేనలో చేరిన సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలో కీలకనేత. టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యకి ఇన్నేళ్లూ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ఉదయభాను. జనసేనలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య 2019లో పొన్నూరు నుంచి తొలిసారి గెలిచారు. పొన్నూరులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. దీంతో జనసేన నేతగా కిలారి రాజకీయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరం. జనసేనలో వరుస చేరికలు కూటమి నేతల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి.