ఏపీలో జనసేన కీలక నిర్ణయం.. కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం (Deputy CM) అంశంపై ఎవరూ స్పందించవద్దని తాజాగా జనసేన (Janasena) కేంద్ర కార్యాలయం నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.


మీడియా ముందుగాని, సోషల్‌ మీడియాలో గాని స్పందించవద్దని సూచించింది.

ఇప్పటికే కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawankalyan) డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వశాఖలను కేటాయించింది. పవన్‌తో పాటు మరొ ముగ్గురికి మంత్రిగా అవకాశాలు దక్కాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తుంది.

అయితే ఇటీవల ముఖ్యమంత్రి తనయుడు , మంత్రి నారా లోకేష్‌కు (Nara Lokesh) డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ అధిష్టానాన్ని కోరారు. దావోస్‌లో జరుగుతున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులోనూ మంత్రి టీజీ భరత్‌ మంత్రి లోకేష్‌ కాబోయే ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ఎదుటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సదస్సు పూర్తయిన తరువాత చంద్రబాబు మంత్రి భరత్‌కు క్లాస్‌ తీసుకున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలని గట్టిగానే హెచ్చరించారు.

ఇదిలా ఉండగా తమ నాయకులు పోటాపోటీగా చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు టీడీపీ, జనసేన అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ కూడా బహిరంగంగా మాట్లాడవద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీకి చెందిన నాయకులకు సమాచారం పంపారు. మంగళవారం ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం డిప్యూటీ సీఎం అంశంపై స్పందించవద్దని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.