యాపిల్ సాగుకు పేరొందిన హిమాచల్ ప్రదేశ్ కొండల్లో జపనీస్ పండు పెర్సిమన్ వైపు ఇటీవలి కాలంలో రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ లాభాలు వస్తున్నందున కుల్లూ జిల్లా ఉద్యాన రైతులు పెర్సిమన్ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ జిల్లాలో రెండేళ్ల కిందట 200 హెక్టార్లున్న వీటి సాగు ఇప్పుడు 404 హెక్టార్లకు చేరింది. మార్కెట్లో ఈ పండ్ల ధర కిలో రూ.వంద నుంచి రూ.200 వరకు పలుకుతోంది. పెట్టుబడి ఎక్కువ, ధర తక్కువ ఉండటంతో తాను దానిమ్మ తోటలను తొలగించి పెర్సిమన్ సాగు ప్రారంభించినట్లు యోగరాజ్ ఠాకుర్ అనే రైతు తెలిపారు. సెప్టెంబరు నెల నుంచే ఈ పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ పండ్ల మొక్కలు కావాలని మిగతా ప్రాంతాల నుంచి ఉద్యానశాఖకు వినతులు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట సాగుకు హెక్టారుకు రూ.62,500 రాయితీ ఇస్తోంది. పెర్సిమన్‌లో పోషక విలువలు కూడా మెండుగా ఉన్నట్లు ఉద్యానశాఖ నిపుణుడు డాక్టర్ ఉత్తమ్ పరాశర్ తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలోనూ ఈ పండ్ల సాగు పెరుగుతోంది.



































