Jasprit Bumrah: బుమ్రాకు ఫ్రీహ్యాండ్‌..బౌలింగ్‌ కోచ్‌ కూడా జోక్యం చేసుకోడు

www.mannamweb.com


టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లను వణికిస్తున్న బౌలర్‌ బుమ్రా(Jasprit Bumrah). ప్రతి మ్యాచ్‌లో భారత్‌కు వెన్నెముకలా ఉండి విజయాన్ని అందిస్తున్నాడు. జట్టులో కూడా అతడి ప్రణాళికలకు ఫ్రీహ్యాండ్‌ ఇచ్చేశారు. ఈ విషయాన్ని సహచరుడు అక్షర్‌ పటేల్‌ స్వయంగా వెల్లడించాడు. వాస్తవానికి బుమ్రా విషయంలో బౌలింగ్‌ కోచ్‌ కూడా పెద్దగా జోక్యం చేసుకోడంట.. స్వేచ్ఛగా ఈ పేసర్‌ తన వ్యూహాలను అమలుచేస్తాడట.

అఫ్గాన్‌తో మ్యాచ్‌ అనంతరం అక్షర్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ బుమ్రా విషయంలో జట్టు ఓ ప్రత్యేక వైఖరిని అవలంభిస్తోందని పేర్కొన్నారు. అతడికి మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని పేర్కొన్నాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌ గురించి జట్టులో ఎవరూ పెద్దగా మాట్లాడరు. ఎప్పుడు ఏం చేయాలో.. ఏం చేయకూడదో అతడికి బాగా తెలుసు. బౌలింగ్‌ కోచ్‌ కూడా ఎక్కువ ఇన్‌పుట్‌లు ఇచ్చి అతడిని అనవసరమైన గందరగోళానికి గురిచేయడు. బాగా ఆడుతున్నావు అని మాత్రమే చెబుతాడు. ప్లానింగ్‌ సమయంలో కూడా నీ వ్యూహాలు విజయవంతమవుతున్నాయి.. అనుకున్నట్లు బౌలింగ్‌ చేయమని చెబుతాడు’’ అని అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

బుమ్రా తర్వాత బౌలింగ్‌కు వచ్చీ రావడంతోనే వికెట్‌ తీయడంపై అక్షర్‌ స్పందిస్తూ.. ‘‘జస్ప్రిత్‌ బుమ్రా ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఎలాంటి కఠిన పరిస్థితినైనా ఎదుర్కోగల బౌలింగ్‌ దళం మాకుంది. అలాంటి సమయంలో మా శక్తి సామర్థ్యాలు, బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలిసిఉండాలి. ఏ బౌలర్‌తోనూ పోల్చుకోకూడదు. ఆ వికెట్‌ నాకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాను.. రెండు బంతులు వేశాక అవగాహన వచ్చింది. ఆ తర్వాత నా పేస్‌, లెంగ్త్‌ను మార్చాను. ఫలితం వచ్చింది. అవతల ఎండ్‌ నుంచి అత్యుత్తమ బౌలింగ్‌ వేస్తుండటంతో నేను అలానే చేయాలని అనుకోను. ఆ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ఎలా ఆడగలనో ఆలోచించాను. అదే నా ప్లాన్‌’’ అని అక్షర్‌ పేర్కొన్నాడు.

సూపర్‌-8ను మాత్రం ఘనవిజయంతో మొదలుపెట్టింది. గురువారం రోహిత్‌సేన 47 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. అఫ్గాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.