JEE Advanced | 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు.. షెడ్యూల్ ఇదే

దేశవ్యాప్తంగా గల ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రాష్ట్రంలో 13 పట్టణాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌ కాలేజీలు, టీసీఎస్‌ ఆయాన్‌ సెంటర్లలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ తుది ఫలితాలు ఏప్రిల్‌ 23 లేదా అంతకంటే ముందే విడుదలకానున్నాయి. ఏప్రిల్‌ 23 నుంచి అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. మే 18న రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు.


ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది. మెయిన్స్‌ రాసిన వారిలో మెరిట్‌ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తారు. ఫలితాలను జూన్‌ 2న విడుదల చేసి ఆ తర్వాత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసి సీట్లను భర్తీచేస్తారు.

రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు..
ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌.