తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిరుద్యోగులకు కీలక అప్‌డేట్‌ చెప్పింది. గత నెలలో విడుదలైన ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి


అయితే దరఖాస్తు గడువు మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నట్లు ఆర్టీసీ యాజమన్యం గుర్తించింది. టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గుడువు పొడిగింపు అనేదే దాని సారాంశం. ఈ క్రమంలో ఆర్టీసీ కీలక ప్రకటన వెలువరించింది.

ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు సమర్పించే తుది గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తుది గడువు ముగిసేలోపు దరఖాస్తులు సమర్పించాలని, ఆ తర్వాత ఎవరికీ అవకాశం ఇవ్వబోమని వెల్లడించారు. కాగా ఆర్టీసీలో మొత్తం 198 ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎమ్మెస్టీ) పోస్టులకు గత ఏడాది డిసెంబరు నెలాఖరున ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 31 నుంచే మొదలయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. తుది గడువు ముగిసేలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, తుది గడువు పొడిగించబోమని శ్రీనివాసరావు తాజాగా స్పష్టం చేశారు.

దరఖాస్తు సమయంలో అప్లికేషన్‌ ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.800, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.