మధ్యంతర బెయిల్ కోసం జానీ మాస్టర్ పిటిషన్.. విచారణ వాయిదా వేసిన కోర్టు

www.mannamweb.com


అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కోర్టు అనుమతితో అతడిని నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించి.. అతడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్ తరపు న్యాయవాది. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకే తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు జానీ తరపు న్యాయవాదులు.

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల (అక్టోబర్ 7)కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కౌంటర్ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్‌ జైల్లో ఉండగానే.. ఈ వివాదంపై ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది. స్టార్‌ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్‌పై ఫిర్యాదుల పరంపర జరిగిందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కానీ.. సదరు నిర్మాత మాత్రం.. ఈ వాదన అసంబద్ధమంటూ కొట్టిపారేశారు. తనపై పెద్ద కుట్ర జరుగుతుందని.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో తనను కార్నర్ చేస్తున్నారని.. బాధితురాలి ఆరోపణలు నిజం కాదని.. పెళ్లి చేసుకోవాలని ఆమే మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది.