వైఎస్ జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద విజయవాడ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. విజయవాడలోని 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడు సతీష్ తరుఫున లాయర్ సలీమ్ వాదనలు వినిపించారు. సతీష్ నిరపరాధి అని.. పోలీసులు ఈ కేసులో అతన్ని ఇరికించారంటూ వాదనలు వినిపించారు. అయితే సతీష్ కావాలనే ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటూ ప్రభుత్వం తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి రేపు (మంగళవారం) కీలక ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.


మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ జగన్ మీద రాయిదాడి జరిగింది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడలో సీఎం జగన్ పర్యటించిన సమయంలో రాయితో దాడి చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో నిర్వహించిన రోడ్‌షోలో సీఎం జగన్ మీద రాయి విసిరారు. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమకన్ను పైభాగంలో గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కన్నుకు కూడా గాయమైంది. అయితే అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు . దర్యాప్తులో రాయి విసిరిన వ్యక్తి అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌కుమార్‌‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ రోడ్‌షో సమయంలో సతీష్‌ తన జేబులో నుంచి కాంక్రీట్‌ రాయిని తీసి సీఎంను లక్ష్యంగా చేసుకుని విసిరినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్డు కస్టడీకి అప్పగించింది. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న సతీష్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ మీద విజయవాడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.