Jr N.T.RamaRao: ప్రముఖ నటుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌టీ (ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూ. ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్టీఆర్ తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం నాడు విచారించింది. ఈ సమయంలో.. ట్రైబ్యునల్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సమర్పించేందుకు వారం గడువు కావాలని, తదుపరి వెకేషన్ కోర్టులో విచారణకు అనుమతించాలని ఎన్టీఆర్ తరుపు న్యాయవాది చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 6న రెగ్యులర్ కోర్టులో జరుగుతుందని ప్రకటించింది.
అసలేం జరిగింది ?
జూనియర్ ఎన్టీఆర్ 2007లో జాబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 881 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అయితే.. సుంకు గీత ఆమె కుటుంబం 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి.. రుణం పొందారు. కానీ, ఆమె ఆ రుణం చెల్లించలేదు. స్థలం కొనుగోలు సమయంలో ఆ విషయన్ని తనకు చెప్పలేదని ఎన్టీఆర్ చెప్పుతున్నారు.
ఈ క్రమంలో ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును ఇచ్చాయి. ఆ స్థలంపై ఎన్టీఆర్ కు హక్కులుండవనీ, బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదయింది. ఈ క్రమంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.