మునగాకులో క్యారెట్ల కన్నా విటమిన్ ఏ, పాల కన్నా కాల్షియం ఎక్కువ. ఈ సూపర్‌ఫుడ్‌ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణక్రియ మెరుగుపడతాయి.
మునగాకులను ఎండబెట్టి తయారు చేసే మునగాకు పొడి వినియోగించడానికి సులువైన మార్గం. నీటి శాతం ఆవిరైపోతుంది కాబట్టి, ఈ పొడి తాజా ఆకుల కంటే అధిక పోషకాలు అందించవచ్చు.
మునగాకు పొడి తయారీ
మునగాకు పొడిని ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు. ఈ పద్ధతిలో చాలా పోషకాలు దక్కుతాయి. తాజా మునగాకులను శుభ్రంగా కడగాలి. తేమ పూర్తిగా ఆవిరైపోయే వరకు నీడలో ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన ఆకులను మెత్తని పొడిగా చేసి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని కొన్ని నెలల వరకు పోషకాలు, రుచి చెదరకుండా నిల్వ చేసుకోవచ్చు. సమయం లేనివారు, సౌలభ్యం కోరుకునేవారు రెడీ టూ యూజ్ సేంద్రీయ మునగాకు పొడిని కొనుగోలు చేయవచ్చు.
ఎలా వాడాలి?
మునగను తక్కువ మోతాదులో తీసుకోవడం మొదలు పెట్టాలి. క్రమంగా శరీరం అలవాటు పడిన తర్వాత పెంచవచ్చు. దీనిని గోరువెచ్చని పాలు, నీరు లేదా స్మూతీస్‌లో కలుపుకోవచ్చు. సలాడ్లపై చల్లుకోవచ్చు. మంచి ఫలితాల కోసం, రాత్రి పడుకునే ముందు కాకుండా, ఉదయం లేదా అల్పాహారం తర్వాత తీసుకోవడం ఉత్తమం.
మునగాకు అందించే 6 ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి పెంపు: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అంటారు. దీనికి కారణం దీని పోషక విలువలు. మునగాకులలో క్యారెట్ల కంటే ఎక్కువ విటమిన్ ఏ, గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్, పాల కంటే ఎక్కువ కాల్షియం, పాలకూర కంటే ఎక్కువ ఇనుము ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: మునగాకు సప్లిమెంట్లు ఉపవాసం ఉన్నప్పుడు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్: దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని మునగలోని యాంటీఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి. వాపు నిరోధక మద్దతు అందిస్తాయి.
జీర్ణక్రియ, డిటాక్సిఫికేషన్: మునగలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.
ఎముకల బలం: మెనోపాజ్ సమయంలో మహిళలకు మునగ ఎంతో విలువైనది. ఇందులో ఉండే కాల్షియం, ఇనుము, విటమిన్ కె ఎముకల సాంద్రతకు మద్దతు ఇస్తాయి. అలసటను తగ్గిస్తాయి. శక్తి తక్కువగా అనిపిస్తే, కాఫీకి బదులు ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది.
రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణ: మునగాకు సారం మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది (చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది). ఇది ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది. గుండె కండరాలను రక్షిస్తుంది.
ఎలా వాడాలి?
మునగను తాజా ఆకులు, కాయలు (మునగకాయ), పొడి రూపంలో భారతీయ ఆహారంలో సులభంగా చేర్చవచ్చు. మునగకాయలను సాంబార్, పప్పు లేదా కూరలలో వాడాలి. ఆకులను ఉడికించి, ఇష్టమైన కూరలో కలపాలి. మునగాకు పొడిని ఓట్స్ లేదా స్మూతీస్‌తో కలపాలి. మునగాకు పొడిని పెరుగు లేదా పాలకూర వంటకాలపై చల్లాలి.
జాగ్రత్త పడవలసిన వారు
మునగ సహజమైనది, సాధారణంగా ఆహారంలో భాగంగా సురక్షితమే. అయితే కొందరు జాగ్రత్త పాటించాలి:
గర్భిణీ, పాలిచ్చే మహిళలు సప్లిమెంట్స్ వాడే ముందు వైద్యుడిని సంప్రదించాలి. మునగ వేర్లు లేదా బెరడు గర్భధారణలో సురక్షితం కాదు.
రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం మందులు వాడేవారు తప్పనిసరిగా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. మునగ మందుల ప్రభావాన్ని పెంచవచ్చు లేదా మార్చవచ్చు.
గమనిక : ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య పరిస్థితికి చికిత్స, ఆహార మార్పుల కోసం అర్హత గల ఆరోగ్య నిపుణుడి సలహా తప్పనిసరి.
































