కేవలం రూ.50.,,,అనంతపురం నుండి బెంగళూరుకు

నంతపురం వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అనంతపురం వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. అనంతపురం – బెంగళూరు మెము రైలు ప్రారంభం కానుంది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ చేతుల మీదుగా జూన్ 4వ తేదీ అనంతపురం – బెంగళూరు మెము రైలు ప్రారంభం కానుంది.


జూన్ నాలుగో తేదీ మధ్యా్హ్నం ఒంటి గంటా 30 నిమిషాలకు ఎంపీ అంబికా లక్ష్మినారాయణ జెండా ఊపి అనంతపురం – బెంగళూరు మెము రైలు ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం ఈ మెము రైలు శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-బెంగళూరు మధ్య నడుస్తోంది. అయితే అనంతపురం వరకూ ఈ మెము రైలును పొడిగించాలని ఎన్నో ఏళ్ల నుంచి స్థానికులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మెము రైలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో స్పందించిన రైల్వేశాఖ పుట్టపర్తి – బెంగళూరు మెము రైలును అనంతపురం వరకు పొడిగించింది. అనంతపురం నుంచి బెంగళూరుకు నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. హైదరాబాద్ మహానగరంతో పోలిస్తే.. అనంతపురం వాసులకు బెంగళూరు దగ్గరగా ఉంటుంది. దీంతో ఉద్యోగాల కోసం విద్యార్థులు, ఉపాధి కోసం కూలీలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనంతపురం నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు.

అయితే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లాలంటే హైదరాబాద్, ముంబై, కాచిగూడ, విజయవాడ నుంచి వచ్చే రైళ్లల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే రిజర్వేషన్లలో సీట్లు నిండిపోవటంతో అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక బస్సులలో వెళ్దామంటే ఛార్జీల భారం. ఈ నేపథ్యంలో మెము రైలు అందుబాటులోకి వస్తే తక్కువ ఛార్జీతోనే బెంగళూరు వెళ్లొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రారంభం కానున్న అనంతపురం – బెంగళూరు మెము రైలులో అనంతపురం నుంచి బెంగళూరుకు ఛార్జీ రూ.50 ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో తక్కువ ఛార్జీతోనే బెంగళూరు వెళ్లొచ్చని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం – బెంగళూరు మెము రైలు టైమింగ్స్ ఇవే..

మరోవైపు 66559 నంబరుతో మెము రైలు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 8.35 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు మధ్యాహ్నం 12.23 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటుంది. ధర్మవరం రైల్వేస్టేషన్‌కు 1.05కు, అనంతపురం రైల్వేస్టేషన్‌కు 1.55 గంటలకు చేరుకుంటుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో 66560 నంబరుతో అనంతపురం – బెంగళూరు మెము రైలు బయల్దేరనుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 2.10 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్‌లో బయలుదేరి.. ధర్మవరం రైల్వేస్టేషన్‌కు 3.00 గంటలకు చేరుకుంటుంది. సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) 3.50కు చేరుకుంటుంది. అలాగే రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు అనంతపురం – బెంగళూరు – అనంతపురం మెము రైలు పుట్టపర్తి, సోమేశ్వర, విదురాశ్వర్థం, కొత్తచెరువు రైల్వేస్టేషన్, బాసంపల్లె, చిగిచెర్ల, జంగాలపల్లె, ప్రసన్నాయపల్లె స్టేషన్లలో ఆగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.