‘164 అసెంబ్లీ.. 21 ఎంపీలు, 93 స్ర్టైక్ రేట్‌తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. వారికి న్యాయం చేయాలి’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందన్నారు. అత్యుత్తమ పాలనలో ఒకప్పుడు మోడల్‌గా ఉన్న రాష్ట్రం, గత ఐదేళ్ల పాలనలో ఎంత దారుణంగా దిగజారిపోయిందో చూశామని గుర్తుచేశారు. పాలన ఎలా ఉండకూడదో గత పాలకులు రాష్ర్టాన్ని మోడల్‌గా చూపారని పవన్ పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పని చేయడానికి పోటీపడేవారని, మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకొద్దామని చెప్పారు. సీఎం చంద్రబాబు అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు.
పంచాయతీల బలోపేతం
‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రక్షిత మంచినీటి సరఫరా, అటవీశాఖ, శాస్త్రసాంకేతిక శాఖలను తీసుకున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేస్తున్నాం. తద్వారా పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. జలజీవన్ మిషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 5.4 కోట్ల గృహలకు తాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 4721 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర వ్యాప్తంగా 29.23 శాతం 37,400 చదరపు కిలోమీటర్ల నోటిఫై చేసిన అడవులున్నాయి. నోటిఫై చేసిన అటవీ పరిధికి అదనంగా 10,221 చదరపు కీలోమీటర్ల గ్రీన్ కారిడర్ ఉంది. చెరువు తీరాలు, ఇన్‌స్టిట్యూట్ ల్యాండ్స్, పంచాయతీ ల్యాండ్స్‌లో కూడా అటవీకరణను ప్రోత్సహించాల్సిన ఉంది. గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అడవులు పెంచేందుకు కృషి చేయాల్సి ఉంది’ అని పవన్ అన్నారు.
వికసిత ఏపీకి అడుగులు
‘రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా.. దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పని చేయదు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పని చేసేవారు ఉంటే ఆ వ్యవస్థ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. గత ప్రభుత్వంలోని వ్యవస్థలను ఎలా ఛిద్రం చేశారో మనం చూశాం. పాలనా అనుభవం ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు, నేర్చుకోవాలనుకునే తపన ఉన్న నాలాంటి వ్యక్తి, పాలన అనుభవం ఉన్న మంత్రివర్గ సహచరులు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళతాం. సీఎం చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకువెళ్తాం. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకూ మనం నలుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో బోర్డర్ దాటి రాష్ట్రంలోకి రావడానికి కూడా అనుమతించని పరిస్థితి. అన్నింటినీ దాటుకుని ముందుకు వచ్చాం. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. 2047లో భారత్ సూపర్ పవర్ కావాలన్నా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారం అవసరం. మాలో, మంత్రివర్గంలో, ఎమ్మెల్యేలతో ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. సామాజిక, రాజకీయ గొడవ వల్ల దేశ సమగ్రతకు ఇబ్బంది వస్తుంది. 2047 ఇండియా సూపర్ పవర్ కావాలంటే వికసిత్ ఏపీలో ముందుకు వెళ్లాలంటే మీ సలహాలు, సూచనలు ఇవ్వాలి’’ అని కలెక్టర్లను కోరారు.