కాదంబరీ జత్వానీ కేసు .. వైసీపీలో పెద్ద చేపకి బిగుస్తోన్న ఉచ్చు, నేడో రేపో అరెస్ట్

www.mannamweb.com


తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కాదంబరీ జత్వానీ కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తుండటంతో పోలీసులు అలర్ట్‌గా ఉంటున్నారు.

ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై వేటు పడగా.. సీనియర్ ఐపీఎస్‌లూ ఇందులో ఉండటంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామాలతో కాదంబరీ కేసులో నెక్ట్స్ ఎవరు..? అనే చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కాదంబరీ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో విద్యాసాగర్ ఆమెను వదిలించుకోవాలని చూసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇందుకోసం నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దల సాయం తీసుకున్నాడని, ఇందుకు కీలక అధికారులు సైతం సహకరించినట్లుగా వార్తలు వచ్చాయి.

విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడకు చెందిన పోలీసులు ఓ బృందంగా ముంబై వెళ్లి.. కాదంబరీని, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కోర్ట్ వీరికి రిమాండ్ విధించగా.. 42 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఈసారి పెళ్లి మాట ఎత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాదంబరీ కుటుంబాన్ని బెదిరించి , వారిపై సంతకాలు తీసుకుని వదిలేశారు. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కాదంబరీ టీడీపీ ప్రభుత్వం రాగానే తనకు జరిగిన అన్యాయంపై మీడియా ముందుకు రావడంతో విషయం వెలుగుచూసింది.

ప్రత్యేక విచారణాధికారిని నియమించిన ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపైనా ప్రభుత్వం వేటు వేసింది. కాదంబరీ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ఎంతటి పై స్థాయిలో ఉన్నా శిక్ష పడేలా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు పడిన నేపథ్యంలో నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ జరుగుతోంది. విద్యాసాగర్ కోసం మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ కేడర్‌ని కనుసైగతో శాసించిన పెద్ద మనిషి పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. కాదంబరీని పకడ్బందీగా ఇరికించిన నిందితులు.. కొన్ని ఆధారాలను వదిలేశారు. ఈ తీగ పట్టుకుని డొంక కదిలించాలని పోలీసులు భావిస్తున్నారు. జత్వానీ కేసు అధికార పార్టీకి బ్రహ్మాస్త్రంలా మారగా.. త్వరలోనే ఆ పెద్ద మనిషి బండారాన్ని బయటపెట్టి వైసీపీకి ఊపిరి సలపకుండా చేయాలని కూటమిలోని కొందరు పెద్దలు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.