Karnataka: అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి ఎవరైనా బయట పడితే గట్టి పిండమే అంటా.. కర్ణాటక రాష్ట్రంలో బోరు బావిలో పడిన ఓ చిన్నారి కూడా అదే అనిపించుకుంది.
20 గంటల పాటు బోరుబావిలో ఉన్న చిన్నారిని రెస్క్యూటీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 20 గంటలు శ్రమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లాలో ఏప్రిల్ 4న జరిగింది.
పొలం వద్ద ఆడుకుంటూ..
విజయపుర జిల్లా లచయానా గ్రామానికి చెందిన సతీశ్ ముజగొండ తన ఇంటి సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఇటీవల బోరు వేయించాడు. నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేశాడు. ఈ క్రమంలో సతీశ్ రెండేళ్ల కుమారుడు బుధవారం(ఏప్రిల్ 3న) ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. దాదాపు 16 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తర్వాత అధికారులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారుల సూచనల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి. బోరుకు సమాంతరంగా 21 అడుగుల లోతు గొయ్యి తావ్వారు. అనంతరం ఎస్కవేటర్ సహాయంతో బాలుడిని బయటకు తీసుకువచ్చారు.
ఆస్పత్రికి తరలింపు..
సుమారు 20 గంటలపాటు బోరుబావిలో ఉన్న చిన్నారిని వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బయటకు తీయక ముందే.. అంబులెన్స్‌తోపాటు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బాలుడిని బయటకు తీసుకురాగానే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
మొత్తానికి 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.