ర్ణాటక రాష్ట్రం హాసన్ సిటింగ్ ఎంపీ, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న ‘అశ్లీల పెన్‌డ్రైవ్’ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
బెంగళూరు, ఏప్రిల్ 28 : కర్ణాటక రాష్ట్రం హాసన్ సిటింగ్ ఎంపీ, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న ‘అశ్లీల పెన్‌డ్రైవ్’ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఏడీజీపీ బీకే సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ ఆదివారం ప్రకటించారు. కాగా.. అశ్లీల వీడియోల అంశం హల్‌చల్ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
అయితే సిట్ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్ తెలిపారు. మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వైరల్‌గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధిత మహిళలు న్యాయం చేయాలని టీవీ చానళ్లు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రజ్వల్ అశ్లీల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి సీఎంకు లేఖ రాశారు.
ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం బెంగళూరులో మాట్లాడుతూ.. ప్రజ్వల్ దేశం విడిచి పారిపోవడం సిగ్గుచేటన్నారు. కాగా.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కావాలని మార్ఫింగ్ వీడియోలను ప్రచారం చేశారని ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపించారు. ఇదిలా ఉండగా, లైంగిక వేధింపులు, నిర్బంధం ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆదివారం హోలినరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు రేవణ్ణ సతీమణి భవాని బంధువుగా పేర్కొన్నారు. తాను వంటమనిషిగా పనిచేయడం ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత రేవణ్ణ తనను వేధించారని, ఆయన కుమారుడు ప్రజ్వల్ తన కుమార్తెకు వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడేవారని ఆమె ఆరోపించారు.