????ఆయన చదువు మాత్రమే చెప్పే టీచరు కాదు.. పేద విద్యార్థులను సొంత ఖర్చుతో చదివించే ఉదార హృదయుడు కూడా! సేవా స్ఫూర్తి కొనసాగిస్తున్న ఆయన గురించి..

ఆయన చదువు మాత్రమే చెప్పే టీచరు కాదు.. పేద విద్యార్థులను సొంత ఖర్చుతో చదివించే ఉదార హృదయుడు కూడా! పాఠాలు చెప్పే బడిపంతులు మాత్రమే కాదు… బడికి అవసరమైన వసతులు, వస్తువులు సమకూర్చే గురు దేవుడు కూడా! విశాఖ జిల్లాలో ఓ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తూ సేవా స్ఫూర్తి కొనసాగిస్తున్న ఆ ఆదర్శ ఉపాధ్యాయుడు కాసా వెంకట శ్రీనివాసరావు. తన సేవాప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే..


‘‘మా స్వస్థలం విశాఖపట్నం. నా చిన్నతనం నుంచి మా నాన్న పేదవాళ్లను చులకనగా చూసేవాడు. అది నాకు నచ్చకపోయేది. నేను మాత్రం నాన్నలా ఉండకూడదని నలుగురికి సాయపడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. కష్టపడి ఎంఫిల్‌ వరకూ చదివాను. 1998లో విశాఖ ఏజెన్సీలో సెకండరీగ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించా. 2017 నుంచి కోటవురట్ల మండలం జల్లూరు ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా.

జీతంలో ఐదు వేలు సేవకు..
పాఠశాలల ఆవరణలో దేశ నాయకుల విగ్రహాల స్థాపన, ప్రహారీ గోడల నిర్మాణం, కుర్చీలు, బల్లలు సరఫరా, మధ్యాహ్నా భోజన పథకం ప్లేట్లు, గ్లాసులు, పాఠశాలలకు అవసరమైన సీలింగ్‌ ఫ్యాన్లు, మైక్‌సెట్లు అందజేశాం. విద్యార్ధులకు నోట్‌ పుస్తకాలు, బెల్టులు, చెప్పులు, టీషర్ట్‌లు, స్కూల్‌ యూనిఫామ్‌లు, దుస్తులు, స్టడీ మెటిరీయల్‌ ప్రతీ ఏటా దాతల సహకారంతో విద్యార్థులకు అందజేస్తున్నాం. ప్రతీ నెలా నా జీతం నుంచి రూ.5వేలను సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాను. దీనికి తోడు రిటైర్డ్‌ హెచ్‌ఎం అన్నమ్మతో పాటు, లండన్‌లో స్థిరపడిన ఒక డాక్టర్‌కు చెందిన అమ్మ ఫౌండేషన్‌, హెచ్‌పీసీఎల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, సత్యసాయి సేవా ట్రస్ట్‌, సిరీస్‌ ఫౌండేషన్‌ వంటి పలు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నాం.

దాతల ద్వారా లక్షల్లో ఆర్థిక సాయం…
ఇప్పటి వరకు రూ.37 లక్షల విలువైన సామాగ్రి, సదుపాయాలను పదికి పైగా పాఠశాలలకు అందజేయగలిగాం. కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. మరికొన్ని గామ్రాల్లో ఉన్నత
పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాను. దాతల సాయంతో 12 మంది నిరుపేద విద్యార్ధులను ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు చదివించాం. నేను వ్యక్తిగతంగా నలుగురు
విద్యార్ధిని విద్యార్ధులకు బీటెక్‌ చదవడానికి ఆర్ధిక సాయం చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరడాన శంకరనారాయణ గుండెపోటుతో మృతిచెందితే ఆయన ఇద్దరి కుమార్తెల బాధ్యత నేను తీసుకున్నాను. పెద్దమ్మాయి మానస బీటెక్‌ పూర్తిచేసి ఇటీవలే ఉద్యోగంలో చేరింది. రెండో అమ్మాయి గాయత్రి బీటెక్‌ పూర్తిచేసి గేట్‌ పరీక్షకు కోచింగ్‌ తీసుకుంటోంది. నేను పనిచేస్తున్న పాఠశాలలో ఎవరైనా నిరుపేద విద్యార్ధులుంటే వారికి వ్యక్తిగతంగా సహాయపడడం, ఉన్నత చదువులు దిశగా వారిని ప్రోత్సహించడం నాకు సంతృప్తినిస్తుంది.

పోటీ పెంచాలనే…
నేను పని చేస్తున్న కోటవురట్ల మండలం జల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరంలో ఇద్దరు విద్యార్ధులు పదికి 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. 2018-19 సంవత్సరంలో కూడా అవే ఫలితాలు సాధించాలన్న ఆశయంతో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించే విద్యార్థులను హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళతామని ప్రకటించాం. అలా ఈ ఏడాది శీరం అంజలి, చిటికెల నీరజ అనే విద్యార్థినులను హైదరాబాద్‌కు విమానంలో తీసుకొనివెళ్లి మూడు రోజుల పాటు అన్ని ప్రాంతాలు చూపించాం. విద్యార్ధుల్లో పోటీతత్వం పెంచి వారి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇలాంటి పోటీవాతావరణం కల్పిస్తున్నాం. నా సతీమణి వెంకటలక్ష్మి సంపూర్ణ మద్ధతు ఉండబట్టే నేను విద్యార్ధులకు అండగా ఉండగలుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం నా జీవితంలో మరపురాని అనుభూతి’’.
సంతృప్తినిస్తోంది…
‘‘నేను ఎప్పుడూ టీచర్‌ అవ్వాలని అనుకోలేదు. కానీ గడిచిన రెండు దశాబ్ధాలుగా టీచర్‌ వృత్తి ఎంతో తృప్తిని, గుర్తింపును ఇచ్చింది. సుమారు 10 పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, వందలాది మంది విద్యార్ధిని విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులు అందించడం నాకూ, అందుకు సహాకరించిన దాతలకు మరపురాని సంతృప్తిని ఇస్తోంది.’’