KCR Visit Karimnagar: కేసీఆర్ అంటే ముందుగా ఫామ్‌హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కేబినెట్ సమావేశం కూడా అక్కడే పెట్టారు. అదంతా రూలింగ్‌లో ఉన్నప్పుడు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
అసలే ఎండాకాలం.. ఆపై సార్వత్రిక ఎన్నికలు.. చివరకు ఉక్కుపోతతో నేతలు కారు దిగేసి వెళ్లిపోతున్నా రు. చాలామంది నేతలు అధికార కాంగ్రెస్ వైపు వెళ్లగా, మరికొందరు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు సగానికిపైగా కారు పార్టీ ఖాళీ అయిపోయింది. చివరకు ఏం చేయ్యాలో అధినేతకు అర్థం కావడంలేదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం జనంలో ఉండడమే ఉత్తమమైన మార్గమని భావించారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు.
చాలామంది నేతలు మాత్రం చంద్రబాబు దారిలోనే కేసీఆర్ కూడా వెళ్తున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. ఆయనతోపాటు నేతలు కూడా నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ రూట్లో వెళ్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మూడోసారి ప్రజల మధ్యకు వెళ్తున్నారు కేసీఆర్.
తాజాగా గులాబీ దళపతి శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి పదిన్నరకు ముగ్దుంపూర్ చేరుకోను న్నారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ రానున్నారు. భోజనం తర్వాత సిరిసిల్లకు వెళ్తారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించ నున్నారు. రాత్రి ఏడుగంటలకు ఎర్రవెళ్లిలోకి వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు.