Kedarnath Temple: ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనటువంటి గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ ఆలయాలు నేడు తెరుచుకోనున్నాయి. చలికాలంలో మూసివేసిన ఈ ఆలయాలు ఇప్పుడు తెరవబోతున్నట్లు ఆఫీసర్స్ పేర్కొన్నారు.
నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి వాలంటీర్లు చెప్పులు లేకుండా కాలి నడకన భుజాలపై మోస్తూ తీసుకువచ్చారని కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా చార్ ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు.
కేదార్ నాథ్ దేవాలయం.. పరమేశ్వరుడి పవిత్ర ఆలయంగా భావిస్తుంటారు. భారతదేశంలోని ఉత్తరాఖండ్ స్టేట్ లోని మందాకిని నదికి దగ్గరలో గర్వాల్ హిమాలయ శ్రేణులలో ఉంటుంది. అతి పురాతనమైన శివలింగాలలో ఇది ఒకటి అని చెబుతుంటారు. దీనిని శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేర్కొంటారు. గౌరికుండ్ నుంచి డోలీలు, గుర్రాల ద్వారా లేదా కాలినడక మాత్రమే ఈ గుడికి భక్తులు చేరుకుంటారు.
రిషికేశ్ నుంచి పూర్తిగా కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం దాదాపు 16 గంటలపాటు సాగుతుంది. ఈ ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్లుగా విశ్వసిస్తుంటారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతిఏటా శీతాకాలంలో ఆరు నెలలపాటు మూసివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆలయం మొత్తం పూర్తిగా మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని శీతాకాలంలో మూసివేసి, తిరిగి వేసవిలో తెరుస్తారు.
నేడు ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో కేదార్ నాథ్ ఆలయాన్ని ముస్తాబు చేశారు. పూలతో ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేదార్ నాథ్ ఆలయం యొక్క తలుపులు తెరుచుకోనున్నాయి. కాగా, 2013 జూన్ లో కేదార్ నాథ్ లో అకస్మాత్తుగా భారీగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే.