62 ఏళ్లు నిండేవరకు వారిని సర్వీసులో కొనసాగించండి

www.mannamweb.com


ఇప్పటికే పదవీ విరమణ చేసి 62 ఏళ్లు పూర్తికాని వారికి ఉపశమనం

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం

వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిన వారికే వర్తింపు

అమరావతి, మే 21 : పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.. ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ(పీఏసీసీఎస్‌) ఉద్యోగులకు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. 62 ఏళ్లు నిండేవరకు పీఏసీసీఎస్‌ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. వ్యాజ్యాలు విచారణలో ఉండగా 60 ఏళ్లకే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటికీ 62 ఏళ్లు నిండకుంటే వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది.

వారికి వేతన బకాయిలను కూడా చెల్లించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తికాకముందు కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తమకు కూడా వర్తింప చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలు ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పదవీ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం చేసిన చట్టం పిటిషనర్లకు వర్తిస్తుందన్నారు. దీంతో పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ పీఏసీసీఎ్‌సలు కూడా తీర్మానాలు చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..

పదవీ విరమణ వయసును పెంచే విషయంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. కో ఆపరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రార్‌ తీర్మానాలను ఆమోదించనంత వరకు వాటికి ఎలాంటి విలువ ఉండదన్నారు. ఈ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తించదని స్పష్టం చేశారు. 62 ఏళ్ల వయసు నిండే వరకు పీఏసీసీఎస్‌ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించాలని ఆదేశించారు.