Arvind Kejriwal: బెయిల్‌పై కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు

www.mannamweb.com


మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బెయిల్ విషయంలో ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై దిల్లీ కోర్టు జూన్‌ 5న నిర్ణయం తీసుకోనుంది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రీవాల్ రేపు జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిఉంది.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ..కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. నేటితో ఆ బెయిల్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దానిపై ఈ రోజు విచారణ జరిగింది.

విచారణ సమయంలో కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఈడీ బెయిల్ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని సీఎం తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును జూన్‌ 5కు వాయిదా వేసింది.