ఏపీలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలపై కీలక అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కౌశలం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసి, వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం.


ఏపీలో ఉన్న యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఇవ్వడానికి నిర్ణయించింది.

గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా టెస్ట్

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల సర్వే కూడా చేసింది. ఈ సర్వేలో నిరుద్యోగుల వివరాలను నమోదు చేసి వీరికి కౌశలం కార్యక్రమం ద్వారా విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు పొందడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఇక నిరుద్యోగుల వివరాలను సేకరించిన తర్వాత, వారి నైపుణ్యాలను పరీక్షించడం కోసం గ్రామ వార్డు, సచివాలయ వేదికగా టెస్ట్ నిర్వహించనున్నారు.

నిరుద్యోగ యువతకు స్కిల్ టెస్ట్ లకు సిద్ధం

ఈ పరీక్షలను నిర్వహించడం కోసం అధికారులు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నమూనా పరీక్షలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే సూచనలను మెయిన్ పరీక్షలను మెరుగుపరచడానికి తీసుకుని ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుతం ఏపీలో సర్వేలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు నవంబర్ 10 నుండి స్కిల్ టెస్ట్ లను నిర్వహించనున్నారు.

టెస్ట్ తర్వాత నైపుణ్య శిక్షణ

ఈ పరీక్షల ద్వారా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగాలు పొందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇక ఈ స్కిల్ టెస్ట్ తర్వాత వారికి తగిన విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ అందించి శిక్షణ కాలంలో ప్రోత్సాహకాలను కూడా అందించనున్నారు. శిక్షణ పూర్తయిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. ఇంటి నుండే ఉద్యోగం చేసుకునేలా వారికి స్థిరంగా ఆదాయం వచ్చేలా చూస్తారు.

స్కిల్ టెస్ట్ నిర్వహించేది వీరికే

ఈ ప్రక్రియలో భాగంగా పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లమా, పి జి ,పిహెచ్డి, ఐటిఐ చదివిన నిరుద్యోగులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. వారి ప్రతిభ మరియు ఆసక్తిని గుర్తించి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను అన్వేషిస్తారు. శిక్షణ నందించి, వారి ఉద్యోగానికి అవసరమైన అర్హతలను నిర్ణయించి, వర్క్ ఫ్రం హోం ద్వారా వారికి ఉపాధి కల్పిస్తారు.

వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం శిక్షణ

నిరుద్యోగులు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ద్వారానే ఇంట్లో నుండే వర్క్ ఫ్రం ఉద్యోగాలు చేసుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతినెల వారికి మంచి జీతం అందేలా చూస్తుంది. కంపెనీలు, సంస్థల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు స్కిల్ టెస్ట్ నిర్వహించి, అవసరమైన శిక్షణను ఇచ్చి వారిని తీర్చిదిద్దనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.