పీఎఫ్‌లో కీలక మార్పులు.. 25 శాతం నిబంధన ఏంటి..? డబ్బులు తీసుకోవాలంటే ఏం చేయాలి..?

పీఎఫ్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో పీఎఫ్ అకౌంట్‌లో కనీసం 25 శాతం నిల్వ ఉండాలనే నిబంధన పెట్టింది. దీని గురించి అనేక అనుమానాలు ఉద్యోగులకు కలుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఆ నిబంధన ఏంటి? అనే వివరాలు చూస్తే..

ఏ రంగంలో ఉద్యోగం చేసేవారికైనా తప్పనిసరిగా పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఇటీవల కొత్త కార్మిక సంస్కరణల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మినిమం శాలరీ లిమిట్ వంటి నిబంధనల్లో పలు మార్పులు చేశారు. దీంతో ఈ నిర్ణయాలు పీఎఫ్‌పై ప్రభావితం చూపనున్నాయి. ఇవే కాకుండా పీఎఫ్ నిబంధనల్లో నిరంతరం ఏవోక మార్పులు తీసుకొస్తున్న కేంద్రం.. ఇటీవల విత్ డ్రా లిమిట్స్‌ను సులభతరం చేసి పలు ఆంక్షలు తొలగించింది. దీని వల్ల ఉద్యోగులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ పీఎఫ్ డబ్బులను సులువుగా తీసుకునే అవకాశం లభించింది. కానీ పీఎఫ్ అకౌంట్‌లో 25 శాతం కనీస నిల్వను మినహాయించి మిగతా సొమ్మును ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు కల్పంచింది. దీనిపై కాస్త గందరగోళం నెలకొనడంతో తాజాగా ఈపీఎఫ్ స్పష్టత ఇచ్చింది.


గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ డబ్బులను పాక్షికంగా తీసుకోవాలంటే మొత్తం తీసుకోవడానికి కుదిరేది కాదు. అందుకోసం సరైన  ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి వచ్చేది. వివాహం కోసం తీసుకోవాలనుకుంటే ఉద్యోగి వాటాలో ఉన్న 50 శాతం సొమ్మును, అనారోగ్య కారణంతో అయితే 6 నెలల శాలరీని విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉండేది. ఇక గతంలో వివాహం కోసం తీసుకోవాలంటే 7 ఏళ్లు, ఇంటి కోసం అయితే 5 ఏళ్ల సర్వీస్ నిబంధన ఉండేది. ఇక వివాహం, ఎడ్యుకేషన్ కోసం అయితే సర్వీస్ కాలంలో మూడుసార్లు మాత్రమే ఉసంహరణ చేసుకునే అవకాశం ఉండేది. కానీ  ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, పెళ్లికి 5 సార్లు తీసుకోవచ్చు.

25 శాతం మినహా మిగతా మొత్తం..

ఇప్పుడు ఏ అవసరానికైనా సరే డబ్బులు తీసుకోవాలనుకుంటే ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా విత్ డ్రాలపై ఎలాంటి పరిమితి లేదు. సర్వీసులో జాయిన్ అయిన 12 నెలల తర్వాత ఎప్పుడైనా కనీస నిల్వ 25 శాతం వాటా మినహాయించి మిగతా సొమ్మును ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇక ఉద్యోగం మానేశాక వెంటనే 75 శాతం సొమ్మును తీసుకోవచ్చు. 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే మిగతా 25 శాతం సొమ్మును కూడా తీసేసుకోవచ్చు.  ఇక స్వచ్చంధ పదవీ విరమణ చేసినా, దేశం విడిచి వెళ్లాలనుకున్నా ఆ 25 శాతాన్ని కూడా తీసుకోవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.