తిరుమల బ్రేక్ దర్శనం అమల్లో కీలక మార్పులు – ఇక నుంచి

తిరుమలో రద్దీ కొనసాగుతోంది. భక్తులకు వేగంగా దర్శనంతో పాటుగా సేవల పైన టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అమలు చేస్తున్న కీలక నిర్ణయాలతో దర్శనం చేసుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది.


ఇదే సమయంలో తాజాగా శ్రీవాణి దర్శనం విషయం లో నూ ప్రయోగాత్మకంగా మార్పులు చేపట్టింది. ఇక, ఇప్పుడు వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో మరో కీలక నిర్ణయం అమలుకు సిద్దం అవుతోంది.

మార్పుల దిశగా

టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాల అమలు విషయంలో మరో ప్రయోగాత్మక నిర్ణయానికి ఆలోచన చేస్తోంది. తిరుమలలో వీఐపీ దర్శనాలు.. సిఫారసు లేఖల ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే బ్రేక్ దర్శనాల వేళల మార్పుతో కొంత మేర సామాన్య భక్తులకు దర్శనం కోసం వేచి చూసే సమయం తగ్గింది. కాగా, కొత్త ఆలోచన మేరకు మరింతగా సామాన్య భక్తులకు వెసులుబాటు కలిగించాలని టీటీడీ ఆలోచన చేస్తోంది. ప్రజాప్రతినిధులకు – 1,800 నుంచి 2,000 టికెట్లు,టీటీడీ ఉద్యోగులు, కేంద్రమంత్రులు, సీఎంవోలు – 1,000 నుంచి 1,500 టికెట్లు, టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు – 580 టికెట్లు,దాతలు, స్వయంగా వచ్చే వీఐపీలు – 600 టికెట్లు,శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తులకు – 1,500 టికెట్లు ఉంటున్నాయి.

సాయంత్రం వేళ

తాజాగా శ్రీవాణి దర్శనం పైన కొత్త నిర్ణయాలు అమలు అవుతున్నాయి. ఇక.. సాయంత్రం వేళల్లోనూ విఐపి బ్రేక్‌ దర్శనాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేస్తోంది. తొలితగా ‘శ్రీవాణి’ ట్రస్టు టికెట్‌ పొందిన భక్తులకు ఈనెల ఒకటో తేదీ నుంచి ఏరోజుకారోజే శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకూ ఒక విడత, రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి నైవేద్యం తరువాత మరో విడత ‘శ్రీవాణి’ ట్రస్టు యాత్రికులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇది సక్సెస్‌ కావడంతో సిఫార్సు లేఖల ద్వారా వచ్చే వారికి ఉదయం పూటే కాకుండా సాయంత్రం వేళల్లోనూ వారికి అవకాశం కల్పించే యోచన చేస్తున్నారు.

ప్రభుత్వంతో చర్చలు

ఇప్పటికే టీటీడీ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను తెలియజేసింది. ఒకేసారి అమలు చేయకుండా, ముందస్తు సమాచారంతో నిర్ణయాలను అమలు చేయాలని భావిస్తోంది.వీఐపీ సిఫారసు లేఖల రద్దు పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. భక్తుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో మరింత మెరుగైన మార్పులు చేయనుంది. సాంకేతికతను వినియోగిస్తూ భక్తులకు మరింత సులభతరంగా దర్శనాలు అందించనుంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయాలు సామాన్య భక్తులకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలా ఉన్నాయి. సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశాలను కల్పించేందుకు టీటీడీ కృషి చేస్తోంది. రాబోయే రోజుల్లో దర్శన విధానం కోసం సాంకేతికతను వినియోగించేందుకు కొత్త ప్రణాళికలను టీటీడీ అమలు చేయనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.