ఏపీలో కూటమి సర్కార్ అదికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ నెరవేరలేదు. ముఖ్యంగా డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ నియామకం, హెల్త్ కార్డుల సమస్య ఇలా చాలానే ఉన్నాయి.
దీంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ తో ఇవాళ ఏపీ జేఏసీ అమరావతి నేతలు భేటీ కానున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సీఎస్ విజయానంద్ తో భేటీ కాబోతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కనీసం పీఆర్సీ కమిషన్ నియమించ లేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు.సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేరవేసే ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించక పోవడం బాధాకరమన్నారు.
ప్రతి ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నాడని బొప్పరాజు తెలిపారు. పెండింగ్లో ఉన్న 4 డీఏ లలో కనీసం 2 డీఏ లు వెంటనే ప్రకటిస్తారని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా ఐఆర్ తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారని, కానీ ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదన్నారు.
ఇవాళ సీఎస్ తో భేటీలో 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయబోతున్నట్లు బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల చెల్లింపుల గురించి ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల వైద్యానికి పనికి రాని హెల్త్ కార్డులు తమకు అవసరంలేదని చెప్పేస్తామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్దిక,ఆర్దికేతర సమస్యలు పరిష్కారంపై నేటి సమావేశంలో స్పష్టమైన హామీ లభించకపోతే ఈ నెల 23వ తేదీ శనివారం జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
































