‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’

మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్‌) ఉపాధ్యాయులు ఆరోపించారు.


మహిళలని చూడకుండా దూషణలకు పాల్పడ్డ ఎస్పీడీ శ్రీనివాసరావు
కేజీబీవీ పీజీటీల ఆవేదన
న్యాయం చేయాలని మంత్రి లోకేశ్‌కు వినతి

అమరావతి: మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్‌) ఉపాధ్యాయులు ఆరోపించారు. ‘వైకాపా ప్రభుత్వం నాది..ఒకవేళ తెదేపా ప్రభుత్వం వచ్చినా నా హవానే నడుస్తుంది. మీకు నచ్చినట్టు చేసుకోండి’ అని సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు బెదిరించారని వాపోయారు. మహిళలని కూడా చూడకుండా తమని దూషించారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు తెలియజేసి న్యాయం కోరేందుకు ఆదివారం వారు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్దకు వచ్చారు. లోకేశ్‌ పీఏకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘2018-19 నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లోకి తీసుకొన్న మమ్మల్ని హేతుబద్దీకరణ పేరుతో వైకాపా ప్రభుత్వం తొలగించింది. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైకాపా పెద్దల్ని ఎంతమందిని కలిసినా..లంచం డిమాండ్‌ చేశారే కానీ..న్యాయం చేయలేదు. మీ నియామకమే తప్పు అని ఎస్పీడీ శ్రీనివాసరావు తిట్టారు. దీనిపై హై కోర్టుకు వెళ్లాం. మమ్మల్ని తొలగించడం న్యాయసమ్మతం కాదని హైకోర్టు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. పైగా మాపై రిట్‌ పిటిషన్‌లు ఫైల్‌ చేశారు. మమ్మల్ని నడిరోడ్డు మీద నుంచోబెట్టారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ను కలిస్తే ‘మీరు నడిరోడ్డు మీద ఇళ్లు కట్టుకున్నారు.. వాటిని తొలగించారు’ అంటూ వెటకారంగా మాట్లాడారు. తెదేపా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో లోకేశ్‌ను కలవడానికి వచ్చాం’’ అని బాధితులు లలిత, కామేశ్వరి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.