KK survey : ఢిల్లీలో మళ్లీ గెలిచేది కేజ్రివాలే-తేల్చేసిన కేకే సర్వే..!

ఇవాళ జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ అంచనాల్ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలుస్తుందని పక్కాగా ఊహించిన కేకే సర్వే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలపైనా తన అంచనాల్ని విడుదల చేసింది.


వీటిలో కేకే సర్వే ఢిల్లీలో ఆప్ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని తేల్చేసింది..

కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఈసారి 44 సీట్లు సాధించబోతున్నట్లు అంచనా వేశారు. అలాగే విపక్ష బీజేపీకి మాత్రం 26 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కడం లేదని తేల్చేశారు. దీంతో వరుసగా నాలుగోసారి కూడా ఢిల్లీలో ఆప్ హవా కొనసాగడం ఖాయమని తేలిపోయింది. అలాగే బీజేపీ ఎంత పోరాడినా గెలుపుకు చాలా దూరంలో నిలిచిపోతున్నట్లు కేకే సర్వే అంచనా వేసింది.

ఢిల్లీ అసెంబ్లీకి ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని అంచనాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఏపీ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన చరిత్ర ఉన్న కేకే సర్వే మాత్రం ఈసారి కూడా ఢిల్లీలో ఆప్ గెలుస్తుందని అంచనా వేస్తోంది. అయితే కేకే సర్వే ఢిల్లీ ఎన్నికల్లో విజేతపై చెప్పిన అంచనాలు నిజమవుతాయో లేదో తేలాలంటే ఈ నెల 8వ తేదీ వరకూ ఆగాల్సిందే.