పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు కొడాలి నాని విమర్శలు.. ఈ మార్పు దేనికి సంకేతం ?

Ex Minister Kodali Nani Comments : బూతు మంత్రి వాయిస్ మారిపోయింది. నోరు తెరిస్తే బూతుల పంచాంగం ఎత్తుకునే ఎక్స్ మినిస్టర్ నీతులు చెప్పడం మొదలుపెట్టారు. సదరు సారు తూలుతూ పదేళ్లుగా చేసిన ఓవర్ యాక్షన్ ఎక్కడ బూమరాంగ్ అయి పీకల మీదకు తెస్తుందో అని భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రత్యర్ధులపై దాడులు చేయడం మాహాపాపం అన్నట్లు ప్రవచనాలు వల్లించడం మొదలుపెట్టారు. అలాగని ఆయన నిజంగా మారిపోయారనుకునే అమాయకులు రాష్ట్రంలోనే కనిపించడరండోయ్. ఇంతకీ ఎవరా సుద్దపూస అంటారా?


కొడాలి నాని.. ఈ పేరుకు, వ్యక్తికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బూతులు మాట్లాడే నేతగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. విపక్ష నేతలపై దురుసుగా విరుచుకుపడాలంటే కొడాలి నాని తర్వాతే ఎవరైనా. అసెంబ్లీ అయినా.. బహిరంగ సభ అయినా.. ప్రెస్ మీట్ అయినా.. ప్లేస్ ఏదైనా.. మాట తీరులో మార్పు ఉండదు. కొడాలికి కౌంటర్ ఇచ్చే ధైర్యం కూడా విపక్ష నేతలకు ఉండేది కాదు. ఎందుకంటే.. వాళ్లెంత మాట్లాడినా నాని కామెంట్స్‌కు దగ్గర్లోకి కూడా వచ్చేవి కాదు. అలా ఉండేది కొడాలి నాని లాంగ్వేజ్. ఇక చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించాలంటే.. మాట్లాడే కొద్దీ నానికి ఊపొచ్చేదే తప్పా.. అలుపు మాత్రం వచ్చేది కాదు.

Also Read : వైసీపీపై ఆపరేషన్ లోటస్ ఇలా.. టార్గెట్ ఆ నేతలే..!

అయితే.. ఇదంతా గతం.. ఇప్పుడు ఆయన స్వరం మారింది. ఐదు నిమిషాల్లో 50 భూతులు మాట్లాడే నాని స్పీచ్‌లో ఈసారి బూతద్దం పెట్టి వెతికినా.. ఒక్క బూతు కూడా కనిపించడం లేదు. సాంప్రదాయిని.. సుప్పిని.. సుద్దపూసని అన్నట్టు నటించారా? నిజంగానే మారారా అనేది తెలియదు కానీ.. పద్దతికి ప్యాంటు, షర్టు వేసినట్టు చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. ఓ సారి ఆయన మాటలు వింటే మీకే మ్యాటర్ అర్థమైపోతుంది.

టీడీపీ నేతల దాడులను ఖండిస్తూ కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని చెప్పారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ నేతలకు సపోర్టు చేస్తున్నారని అన్నారు. అందుకే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. అయితే.. ఎంటైర్ ప్రెస్‌మీట్‌లో ఒక్కమాట కూడా తూళలేదు కొడాలి. టీడీపీ నేతలను పాలసీలపై ప్రశ్నించి ప్రెస్‌మీట్ క్లోజ్ చేశారు. ఇప్పుడిదే టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్‌గా మారింది. నోరెత్తితే లుచ్చా.. బచ్చా అనే నాని.. మొక్కకు అంటు కట్టినట్టు, అయ్యప్ప, అమ్మవారి మాలలను ధరించినట్టు ఇంత పద్దతిగా మాట్లాడారేంటని వైసీపీ నేతలే ఆశ్చర్య పోతున్నారు.

వ్యక్తిగతంగా దూషించిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో రాశానని.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో.. కొడాలి నాని లాంటి వారికి భయం పట్టుకుందని.. ఆ భయం నుంచే ఈ పద్దతి వచ్చిందని కొందరు అంటున్నారు. ఓటమి భయం మాత్రమే కాకుండా నానికి తత్వం బోధపడిందని అనే వాళ్లు కూడా ఉన్నారు. 151 స్థానాల నుంచి వైసీపీ 11 స్థానాలకు పడిపోవడం, ఓటమంటే తెలియని నానిని గుడివాడ ప్రజలు తిరస్కరించడంతో ఆయన వాస్తవాన్ని అర్ధం చేసుకున్నారని అంటున్నారు. అందుకే నాని మాటల్లో మార్పు కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది.